కీర్తిసురేష్ పరీక్షలో నెగ్గింది. అగ్ని పరీక్షగా భావించిన 'మహానటి' సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది, గుడ్ టాక్‌తో సక్సెస్ లిస్టులో చేరిపోయింది. తన నటనతో సావిత్రి పాత్రకు న్యాయం చేసి ప్రేక్షకులను మెప్పించింది కీర్తిసురేష్. సినిమా విడుదలకు ముందు విమర్శలను ఎదుర్కొన్న కీర్తి సురేష్ సినిమా విడుదలయ్యాక, ఆ విమర్శలన్నీ, ప్రశంసలుగా మార్చేసుకుంది.
పలువురు ప్రముఖులతో పాటు, విమర్శకులు కూడా తమ తమ విమర్శల్ని వాపస్ తీసుకుని, కీర్తిని పొగిడేస్తున్నారు. 'మహానటి'లో సావిత్రి పాత్రను అంతగా టేకప్ చేసింది కీర్తి సురేష్. తాజాగా జక్కన్న రాజమౌళి కీర్తి సురేష్‌ని ప్రశంసలతో ముంచెత్తేశారు. 'సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన తీరు అద్భుతం. ఇంత అద్భుతమైన నటనను నేనింతవరకూ చూడలేదు. సావిత్రి పాత్రను ఇమిటేట్ చేయడం కాదు, ఆమె లెజెండరీ నటికి మళ్లీ ప్రాణం పోసింది. 'అని కీర్తిసురేష్‌ని ప్రశంసించారు రాజమౌళి. అంతేకాదు. యంగ్ డైరెక్టర్ అయినప్పటికీ ఓ క్రిటికల్ సబ్జెక్ట్ అయిన 'మహానటి'ని ఇంత బాగా టేకప్ చేసిన నాగ్ అశ్విన్‌కి ఇప్పటి నుంచి నేను అభిమానిని అని నాగ్ అశ్విన్‌ని ప్రశంసించారు రాజమౌళి.
మొత్తానికి రాజమౌళే కాదు, పలువురు సినీ ప్రముఖులు 'మహానటి' టీమ్‌ని ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. నాగ్ అశ్విన్ అద్భుత సృష్టి 'మహానటి' అంటున్నారు. తెలిసిన కథే అయినా ఎక్కడా బోర్ కొట్టించకుండా, సాగదీయకుండా, ఉద్వేగభరితంగా విజయవంతంగా 'మహానటి'ని తెరకెక్కించాడంటూ అందరూ నాగ్ అశ్విన్‌ని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు సావిత్రి అంటే తెలియని ఈ తరం వారికి కూడా ఆమె గొప్పతనం తెలిసేలా చేసింది 'మహానటి' చిత్రం.