మన దేశం కలను నిజం చేసింది ఆర్.ఆర్.ఆర్. ఏకంగా ఆస్కార్ పట్టుకొచ్చేసింది. దాంతో.. అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. దేశ వ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
``భారతీయులంతా గర్వపడే క్షణం ఇది. ఈ పాటను ఆస్కార్ వరకూ తీసుకెళ్లిన చిత్రబృందానికి అభినందనలు. ఈ చిత్రంలో చరణ్ కూడా భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. ఓ తండ్రిగా గర్విస్తున్నా`` అని చిరంజీవి తెలిపారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్.ఆర్.ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆర్.ఆర్.ఆర్‌లోని నాటు నాటు పాట, భారతీయ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లిందని అభినందించారు పవన్ కల్యాణ్. నాటు నాటు గీతంలోని ప్రతి పదం.. తెలుగు నేల నలుచెరుగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించిందని కొనియాడారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు పవన్. ఈ అవార్డుకు కారణమైన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలను సైతం ఆయన అభినందించారు.