'సర్కార్' సినిమా వివాదానికి సంబంధించి, మురుగదాస్ అరెస్ట్‌కి రంగం సిద్దమైంది. సినిమాలో దివంగత ముఖ్యమంత్రి జయలలితను కించపరిచే సన్నివేశాలున్నాయంటూ అధికార అన్నా డిఎంకే పార్టీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మురుగదాస్ అరెస్ట్ తప్పదని అందరూ అనుకున్నారు.
ఆ దిశగా అన్నాడిఎంకే ప్రభుత్వం పావులు కదిపింది. అయితే మురుగదాస్ తనను అరెస్ట్ చేయొద్దంటూ కోర్టును ఆశ్రయించాడు. చెన్నై హైకోర్టులో మురగదాస్‌కి ఊరట లభించింది. ఈ నెల 27 వరకూ మురుగదాస్‌ని అరెస్ట్ చేయద్దనీ చెన్న్నె హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దాంతో మురుగదాస్‌కి పెద్ద ఊరట లభించినట్లైంది. ఇదిలా ఉంటే 'సర్కార్' ఆల్రెడీ వంద కోట్లు క్లబ్‌లోకి చేరుకుంది. ఈ వివాదం కారణంగా సినిమా వసూళ్లు మరింత పెరిగాయని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు.
విజయ్ సినిమాల్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టింది 'సర్కార్'. విజయ్ సరసన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులోనూ అంచనాలకు మించి.. టాక్‌కి భిన్నంగా 'సర్కార్' వసూళ్లను సాధిస్తోంది. సినిమా అంతంత మాత్రంగానే ఉందనీ రివ్యూలు తేల్చినా వసూళ్లు మాత్రం సూపర్ హిట్ సినిమాని తలపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనీ, త్వరలో రాజకీయ నిర్ణయం ప్రకటిస్తాడనీ అభిమానులు ఆశిస్తున్నారు. ఆశించడమే కాదు, విజయ్ రాజకీయాల్లోకి రావాలని అభిమాన సంఘాలు తీర్మానించేస్తున్నాయి.