'గతంలోనూ సినిమాల్లో ముద్దు సీన్లుండేవి. అయితే అవి అత్యంత హింసాత్మకంగా ఉండేవి. మహిళలను హింసాత్మకంగా ప్రేరేపించే సన్నివేశాల్లో ఆ సీన్లుండేవి. అయితే ప్రేక్షకులు అప్పట్లో వాటిని అంగీకరించారు. కానీ ఇప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సినిమాల్లో ముద్దు సీన్లు తీయాలంటేనే భయపడుతున్న పరిస్థితి. సెన్సార్ వద్ద ఆటంకాలు తలెత్తుతాయేమోనని. నిజానికి ఇప్పుడు ముద్దు సీన్లను ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాల్లో గ్లామరస్‌గా, రొమాంటిక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముద్దు సీన్లను ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో నాకు అర్ధం కావడం లేదు..' అని వాపోయారు ప్రముఖ నటుడు అరవింద్ స్వామి.
తమిళ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన రీ ఎంట్రీలో విభిన్న తరహా క్యారెక్టర్స్‌ని ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్నారు. తాజాగా ఆయన 15వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చర్చించిన పలు అంశాల్లో భాగంగా పైన పేర్కొన్న విషయాలను ప్రస్థావించారు. రెండు వేల ఏళ్ల క్రితం వాత్సాయన 'కామసూత్ర'ను రచించారు. అయితే రెండు వేల ఏళ్ల తర్వాత ఇప్పుడు తమిళనాడులో కొన్ని చిత్రాల్లో ముద్దు సీన్లను తెరకెక్కించాలంటే భయపడుతున్నాయనీ ఆయన అన్నారు. అవును ఆయన నిజమే చెప్పారు.
ఈ మధ్య పలు చిత్రాలు ముద్దు సీన్లు పేరు చెప్పి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే 'పద్మావతి' చిత్రం విషయంలో వచ్చిన వివాదాలు, ఆ చిత్ర డైరెక్టర్ భన్సాలీ, నటి దీపికకు వచ్చిన బెదిరింపులు తదితర అంశాల గురించీ మాట్లాడారు ఆయన. అయితే సినిమాల్లో తప్పును ఎత్తి చూపే వారు ఎక్కువైపోయారు. సినిమాని సినిమాగా చూసేవారు తక్కువైపోయారు. సినిమా పట్ల అలాంటి ఆలోచనలు మార్చుకోవాలనీ అరవింద్‌స్వామి అన్నారు.