నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగేస్తుంది. మంచి - చెడూ గురించి కూడా ఇలాగే మాట్లాడుకోవాలి. దురదృష్టవశాత్తూ పైరసీ వేగాన్ని తెలుగు సినిమా తట్టుకోలేకపోతోంది. సినిమా సాధారణ ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్ని గంటల ముందే పైరసీ ప్రపంచం చుట్టేస్తోంది. 'అరవింద సమేత..' కూడా ఈ బెడద నుండి తప్పించుకోలేకపోయింది. అర్ధరాత్రి నుండి సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్, వీడియో క్లిప్పింగ్స్ (ధియేటర్స్‌లో షూట్ చేసినవి) హల్‌చల్ చేస్తున్నాయి.
ఇవి మొబైల్ ఫోనుల్లోకీ వచ్చేశాయి. పైరసీకి బాధపడొద్దు. పైరసీని ప్రోత్సహించొద్దు అంటూ చిత్ర నిర్మాణ సంస్థ హారికా హాసినీ క్రియేషన్స్ తరపున అభ్యర్థనలు, హెచ్చరికలు ఓ పక్క, అభిమానుల వైపు నుండి సూచనలు మరో పక్క కొనసాగుతున్నా పైరసీ మాత్రం ఆగలేదు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్, రెడ్డి సాంగ్ కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా ముక్కలు ముక్కలుగా వీడియోలు బయటికొచ్చేశాయి.
కోట్లు ఖర్చు చేసి, నెలల తరబడి వందలాది మంది కష్టపడితే, ఓ సినిమా రూపొందుతోంది. దాన్ని క్షణాల్లో ఇలా నాశనం చేసేస్తున్నారు. పైరసీకి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు జరుగుతున్నా ఈ రక్కసిని అంతమొందించడం కాదు కదా, ఈ రక్కసి ధాటిని కూడా తట్టుకోలేని పరిస్థితి. ఇదిలా ఉంటే, ఓ హీరో అభిమానులు ఇంకో హీరో సినిమాపై తమ పైత్యాన్ని ప్రదర్శిస్తుండడం బాధాకరం. అరదుకే అలాంటి వారిని 'అభిమానులు' అనకూడదు. శాడిస్టులుగా అభివర్ణించడం సబబు.