యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'అరవింద సమేత' సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు, ఇప్పుడు వివాదాలకూ కేంద్ర బిందువుగా మారుతోంది. సినిమాలోని కొన్ని కీలకమైన సన్నివేశాల్ని 'కాపీ' కొట్టారని కొందరు, కథ మొత్తం కాపీ కొట్టిందేనని మరికొందరు మీడియాకెక్కుతున్నారు.
కొందరైతే, రాయలసీమను అవమానించేలా సినిమా రూపొందించారని ఆరోపిస్తున్నారు. సినిమాకీ వివాదాలకీ విడదీయలేని బంధం.. అన్నట్టు తయారైంది ఇటీవలి పరిస్థితి. ఓ సినిమాలోని ఓ సన్నివేశం తమ మనోభావాల్ని దెబ్బతీసిందని ఓ వర్గం ఆందోళన చేయడం, ఫలానా డైలాగ్‌తో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని మరో వర్గం సినిమాకి వ్యతిరేకంగా నినదించడం.. ఈ మధ్య సర్వసాధారణమైపోయాయి. తద్వారా ఆయా సినిమాలకు అదనంగా పబ్లిసిటీ వచ్చిపడుతున్న మాట వాస్తవమే అయినా, కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసి వివాదాల్ని ఎదుర్కోవాల్సి రావడాన్ని ఏ చిత్ర యూనిట్ కూడా పాజిటివ్‌గా తీసుకోలేదు.
'అరవింద సమేత' విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. నిజానికి అరవిందపై వస్తున్న ఆరోపణలు సిల్లీగా వున్నాయన్నది మెజార్టీ అభిప్రాయం. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలొచ్చాయి. చాలా చాలా హింసాత్మక సినిమాల్ని కూడా చూశాం. 'అరవింద సమేత'లోనూ కొంత హింస వున్నా, సినిమా కథని కొత్తగా నడిపించి, హింసకు వ్యతిరేకంగా దర్శకుడు చెప్పిన మంచి విషయాలకు అంతటా సానుకూల స్పందన లభిస్తోంది.
పనిగట్టుకుని ప్రచారం కోసం కొందరు తెరపైకి తెచ్చే వివాదాలు, ఆయా వ్యక్తులకు కొంతమేర పబ్లిసిటీ తెస్తున్న మాట వాస్తవం. మరి 'అరవింద సమేత' యూనిట్, ఈ వివాదాలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలిక. ఇదిలా వుంటే, తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ ముగిసే సరికి, 'అరవింద సమేత' 49 కోట్లకు పైగా షేర్ సాధించింది.