కొత్త కథలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? అనేది దర్శకుల ప్రశ్న. నిజమే... కథల్లో కొత్తదనం ఉండదు. చూసిన కథే, తెలిసిన కథే తిప్పి తిప్పి కొడుతుంటారు. తెలిసిన కథనే ఎంత కొత్తగా చెప్పారన్నదే ఇప్పటి ట్రెండ్. కమర్షియల్‌సినిమా ఏదైనా తీసుకోండి. అందులో గత హిట్ చిత్రాల ఛాయలు కొన్నయినా కనిపిస్తాయి. ఇప్పుడు రాబోతున్న 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం కూడా అందుకు అతీతం కాదేమో అనిపిస్తోంది.
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌ల కాంబినేషన్ తొలిసారి చూసే అవకాశం దక్కింది. ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కైతే తెగ నచ్చేసింది. త్రివిక్రమ్ అభిమానులు కూడా 'గురూజీ ఈజ్ బ్యాక్' అంటూ ఆ డైలాగులకు పండగ చేసుకుంటున్నారు. అయితే కొంతమందికి మాత్రం ఈ ట్రైలర్‌లో 'మిర్చి', 'దమ్ము' కథలు కనిపిస్తున్నాయి.
నరుక్కుంటూ పోతే భూమ్మీద మనిషన్నవాడే ఉండడు.. పగోడ్ని కూడా ప్రేమించాలి - అన్నది 'మిర్చి' కాన్సెప్ట్. పగ ప్రతీకారాలతో రగిలిపోయే సీమలో కథానాయకుడు అడుగుపెట్టి శాంతి మంత్రం జపిస్తాడు. అందరిలోనూ మార్పు తీసుకొస్తాడు. అదే 'మిర్చి' కథ.
ఫ్యాక్షన్ కక్షలతో రగిలిపోతున్న సీమలోకి కథానాయకుడు అడుగుపెడతాడు. వారసత్వంగా సంక్రమించిన పగ ప్రతీకారాల్ని.. తన భుజాలపై వేసుకుని శత్రు సంహారం చేస్తాడు. ఆ ప్రయాణంలో ఫ్యాక్షనిజం లేకుండా చేస్తాడు. ఇదీ 'దమ్ము' కథ. సరిగ్గా ఈ రెండు కథల్నీ మిక్సీలో వేసి తీసినట్టుంది `అరవింద సమేత` ట్రైలర్.
ఈ రెండు సినిమాల లక్షణాలూ టీజర్‌లో కనిపించాయి కూడా. మరి.. సినిమా కూడా ఇలానే ఉంటుందా? ఫస్టాఫ్ మిర్చి, సెకండాఫ్ దమ్ములా కనిపిస్తుందా? అనేది అభిమానుల సందేహం. అవునా, కాదా అనేది తేలాలంటే అక్టోబరు 11 వరకూ ఆగాల్సిందే.