ఎన్టీఆర్‌ని అభిమానులు ముద్దుగా యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు. ఆ పేరుకు తగ్గట్టే... వేటకు బయల్దేరిన పులిలా ఎప్పుడూ హుషారుగా ఉంటాడు ఎన్టీఆర్. సెట్లో తారక్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సినిమా వేడుకలోనా ఆ హుషారు కనిపిస్తుంది. అయితే `అరవింద సమేత వీర రాఘవ`లో ఓ కొత్త తారక్ ని చూశారు.
ఎమోషనల్ అవుతూ.. ఫిలసఫికల్ టచ్ ఇచ్చే తారక్ ని చూశారు. తన తండ్రి హరికృష్ణ మరణానంతరం జరిగిన తొలి సినీ వేడుక ఇది. ఎన్టీఆర్ ఎమోషనల్ అవ్వడం ఖాయం అని అభిమానులు ముందే అనుకున్నారు. కానీ.. `అంతకు మించిన` తారక్ వాళ్లకు కనిపించేసరికి.. అభిమానుల గుండెలూ తల్లడిల్లిపోయాయి. వేదిక దగ్గరకు వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకూ... ఎన్టీఆర్ కళ్లళ్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి.
ఒక్కటంటే ఒక్క సందర్భంలోనూ చిరు నవ్వు చిందించలేదు. వేదికపై `రం.. రుధిరం` పాట పాడుతున్నప్పుడైతే ఎన్టీఆర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. దానికి కారణం... ఆ పాట చావుతో ముడిపడి ఉంటుంది. సినిమాలో తన తండ్రి చితికి నిప్పంటించేటప్పుడు వచ్చే పాట. దాంతో సహజంగానే హరికృష్ణ గుర్తొచ్చి ఎమోషనల్ అయిపోయాడు తారక్. కల్యాణ్ రామ్ మాట్లాడుతున్నప్పుడు, హరికృష్ణ కోసం సభ కొన్ని నిమిషాలు మౌనం పాటిస్తున్నప్పుడు కూడా ఎన్టీఆర్ కదిలిపోయాడు.
ఇక స్పీచ్ సంగతి సరేసరి. మాట్లాడుతున్నంతసేపూ.. కళ్లలోంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. తన మాటల్లో ఫిలసఫికల్ టచ్ కూడా ఇచ్చాడు తారక్. మనుషులున్నప్పుడు వాళ్ల విలువ తెలీదని, లేనప్పుడు ఆ వ్యక్తి మన మధ్య ఉండడని, 28 చిత్రాల్లో తొలిసారి తండ్రి చితికి నిప్పు అంటించే సన్నివేశంలో నటించానని, యాధృచ్చికంగా ఆ ఘటన తన జీవితంలోనూ జరిగిందని విషాద వదనంతో చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.
తన తండ్రి ఓ తండ్రికి గొప్ప కొడుకని, కొడుకులకు గొప్ప తండ్రి అని, ఓ భార్యకు గొప్ప భర్త అని.... అలాంటి వ్యక్తి తమ మధ్య లేకుండా పోయారని, ఈ ఒక్క సినిమా చూడ్డానికైనా ఆయన ఉండాల్సిందని చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఎన్టీఆర్ కన్నీళ్లు ఆగలేదు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ ఎన్నో స్పీచులు ఇచ్చి ఉంటాడు.కానీ ఈ స్పీచ్ మాత్రం అలా నిలబడిపోతుంది. ఎన్టీఆర్‌ని టీవీల్లోనూ, ప్రీ రిలీజ్ వేడుకలోనూ చూసిన అభిమానులు సైతం.. కంటతడి పెట్టారంటే ఆయన స్పీచ్ ఎంత ఎమోషనల్ గా సాగిందో అర్థం అవుతుంది.