పదహారణాల తెలుగమ్మాయ్ వేద అలియాస్ అర్చన భవిష్యత్తులో రాజకీయాల ఆలోచన చేస్తోందా.? అంటే అవుననే అనిపిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత కొన్ని స్పెషల్ రోల్స్‌లోనూ నటించింది. తెలుగు బిగ్‌బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు జోరుగా వస్తాయనుకుంటే, తర్వాతా పెద్దగా కలిసి రాలేదు అర్చన పాపకు. కానీ, షార్ట్ ఫిలింస్‌లో అవకాశాలొచ్చాయి. కొన్ని పాపులర్ షార్ట్ ఫిలింస్‌తో అర్చన ఆకట్టుకుంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఓ సినిమా ద్వారా బిగ్‌స్క్రీన్‌పై మెరవబోతోంది. కమెడియన్ సప్తగిరి హీరోగా రూపొందుతోన్న 'వజ్రకవచధర గోవిందా' సినిమాలో అర్చన కీలక పాత్ర పోషిస్తోంది. అదీ ఓ ఎమ్మెల్యే పాత్ర కావడం విశేషం. ఎమ్మెల్యేగా అర్చన పాత్ర చాలా హుందాగా, పవర్‌ఫుల్‌గా ఉండబోతోందట ఈ సినిమాలో.
ఇలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి కావడంతో, ఆ ఫీల్ చాలా బాగుందంటోంది అర్చన. అలాగే ఈ సినిమాతో రీల్ రాజకీయాల్లో అనుభవం సంపాదించిన అర్చన, రియల్ రాజకీయాల మాటేంటని అడిగితే, ఏమో ఫ్యూచర్‌లో అవకాశం వస్తే ఆ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటానంటోంది. ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలు రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. సినిమాలో స్టార్స్ అనిపించుకున్న రోజా, విజయశాంతిలాంటి హీరోయిన్స్‌తో పాటు, అర్చనలా తక్కువ సినిమాలతో సుపరిచితులైన మాధవీలత వంటి వారు కూడా రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ఇటీవల ఎన్నికల్లో నటి మాధవీ లత బీజేపీ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ కోవలోనే అర్చన కూడా ఫ్యూచర్ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది కాబోలు.