విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'అర్జున్‌రెడ్డి' సినిమా సెన్సేషన్స్ ఆగడం లేదు. ఆ సినిమా విడుదలై రెండు వారాలు గడిచింది. కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. మొన్న బాలయ్య హీరోగా వచ్చిన 'పైసా వసూల్' సినిమా విడుదలైంది. ఓ స్టార్ హీరో. మాస్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్. మాస్ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్న ఈ సినిమా 'అర్జున్‌రెడ్డి' ఉనికిని ఏమాత్రం తగ్గించేలేకపోయింది. ఓ పెద్ద సినిమా ముందు ఈ చిన్న సినిమా వసూళ్ల వర్షం తగ్గడం లేదు. నిన్న రెండు సినిమాలు విడుదలయ్యాయి. నాగచైతన్య హీరోగా వచ్చిన 'యుద్ధం శరణం', అల్లరి నరేష్ హీరోగా 'మేడ మీద అబ్బాయి'. యాక్షన్ అండ్ డిఫరెంట్ జోనర్ మూవీ ఒకవైపు. ప్రేక్షకులు మెచ్చే జబర్దస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఇంకోవైపు. అయినా కానీ అర్జున్‌రెడ్డికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. వసూళ్లు జోరు అలాగే కంటిన్యూ అవుతోంది. సుడి అంటే ఇదే. మనోడి సుడి ముందు ఏ సినిమా అయినా, ఎంతటి స్టార్ అయినా భళాదూర్ అనేంతగా ఉంది. నాలుగు కోట్లతో తెరకెక్కిన సినిమా ఇది. ఇంతవరకూ నలభై కోట్లు వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లోనూ నో డిఫరెన్స్. విడుదలైన రోజు నుండీ ఓ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తోంది. పెద్ద సినిమాల్లో 'బాహుబలి', చిన్న సినిమాల్లో 'అర్జున్‌రెడ్డి' అని చెప్పుకునే స్థాయిలో ఈ సినిమా వసూళ్లున్నాయంటున్నారు అదీ 'అర్జున్‌రెడ్డి' స్టామినా.