ప్రతివారం విడుదల అయిన చిత్రాల గురించి నేను గత కొన్ని వారాలుగా www.iqlikmovies.com ని వేదికగా చేసుకుని రాస్తున్న ఈ ప్రత్యేక శీర్షికలో, ఈవారం అర్జున్ రెడ్డి చిత్రం పైన నా భావాన్ని రాస్తున్నందుకు చాలా పెద్ద ఎక్సైట్మెంట్ తో ఉన్నాను.
ఇక నేను సినిమాల గురించి వినడం అలాగే వాటిని చూస్తూ సినీ మాధ్యమం పైన ఆసక్తి పెంచుకున్న నాటి నుండి నేను చూసిన చాలా సినిమాలలో అర్జున్ రెడ్డి ప్రత్యేకంగా నిలిచిపోనుంది. కారణం, ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి దర్శకుడు సందీప్ రెడ్డి చూపిన తీరు ఏ తెలుగు ప్రేక్షకుడు కలలో సైతం ఊహించని తీరు కావడమే ఈ చిత్రాన్ని ఒక ప్రత్యేకమైన కోవలోనికి తీసుకెళ్ళింది.
అర్జున్ రెడ్డిని కల్ట్ సినిమా అంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండగా, మరి ఆ ‘కల్ట్’ అంటే సరైన అర్ధం నాకు తెలియనప్పటికీ, నాకు మాత్రం ఈ సినిమా.. తెలుగు సినిమాల స్టీరియో టైపు మేకింగ్ కి చెక్ పెట్టిన సినిమాగా మాత్రం చెప్పగలను. అయితే భవిష్యత్తులో ఇటువంటి తరహా చిత్రాలు రాక పెరుగుతాయి అనడడంలో సందేహం లేనప్పట్టికి, ఇటువంటి కథనానికి తగినంత ముడిసరుకు లేకుండా ప్రయత్నిస్తే మాత్రం చేదు అనుభవం మిగలుతుంది అన్నది మాత్రం అక్షర సత్యం.
ఈ చిత్రం ఏ ఒక్క వర్గాన్నో టార్గెట్ చేసి తీయలేదు అని సినిమా చూసాక మనకి అర్ధమవుతుంది. ఎందుకంటే, బూతులు, హీరో-హీరోయిన్ మధ్య ముద్దులు, మందు తాగుతున్న సన్నివేశాల కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమాకి దూరం చేసినా, ఆ సెక్టార్ ఆడియన్స్ లో కొత్తదనం కోరుకునే వారు ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని మిస్ అయ్యారనే చెప్పాలి.
నటీనటుల నటన, ఛాయాగ్రహకుడి పనితనం, సంగీత దర్శకుడి హృద్యమైన సంగీత సహకారాలని సమన్వయం చేస్తూ దర్శకుడు మనకి చూపిన ఈ వాస్తవిక ప్రేమ కావ్యం ఎంతో మంది హృదయాలని ఇప్పటికే కదిలించేసింది.
ఒకవేళ కదిలించకపోయి ఉంటే, వారు నిజం ఒప్పుకొని వారు అయినా కావాలి లేక తమ హృదయానికి తాళం వేసిన వారు అయినా అయి ఉండాలి.
ఇక ఈ చిత్రానికి సంబందించిన కలెక్షన్స్, రేటింగ్స్ గురించి మాట్లాడే ఆసక్తి నాకు గాని ఇది చదివే వారికి గాని ఉండకపోవచ్చు! ఎందుకంటే, ఈ చిత్రం ఇవ్వన్ని దాటుకుని చాలా ముందుకి వెళ్ళిపోయింది.
ఆఖరుగా.. ట్రెండ్ సెట్టర్ అనే పదానికి ఎవరైనా విలువ ఇస్తే మాత్రం, వారికి ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ అని మాత్రం గట్టిగా అరిచే కాదు ఇక్కడ అండర్ లైన్ చేసి మరి చెప్పగలను.
- సందీప్