వివాదాలు, విమర్శలతో సహజీవినం చేస్తున్న నటి కంగనారనౌత్. ఆమెలా... వార్తలకెక్కిన తార ఈమధ్య కనిపించలేదు. ఎప్పుడూ ఏదో ఓ సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. టాక్ ఆఫ్ ది ఇండ్రస్ట్రీగా నిలుస్తోంది. ఆమెపై పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులు బోలెడు. తాజాగా ముంబై కోర్టు.. కంగనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఓ కేసు నిమిత్తం సోమవారం.. ఆమె కోర్టుకి హాజరు కావాలి. కానీ... ఆమె రాలేదు. దాంతో ముంబై కోర్టు.. కంగనపై సీరియస్ అవుతూ, అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఆమధ్య ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గీత రచయిత జావెద్ అక్తర్ ని ఉద్దేశిస్తూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగనా. జావెద్ కూడా `సూసైడ్ గ్యాంగ్‌లో ఒకడు` అంటూ తీవ్రమైన విమర్శలు గుప్పించింది. బాలీవుడ్ లో ఈమధ్య తారలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అలా వాళ్లని పురిగొల్పేవాళ్లలో జావెద్ ఒకడని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది కంగనా. దీనిపై జావెద్ లాయర్ కోర్టు కెక్కాడు. ఈ కేసు నిమిత్తంలోనే ముంబై కోర్టు.. కంగనకు సమన్లు జారీ చేసింది. దాన్ని కంగనా పట్టించుకోకపోవడంతో అరెస్ట్ వారెంట్ వరకూ వచ్చింది. దీన్ని హైకోర్టులో అప్పీల్ చేస్తామని కంగనా తరపున న్యాయవాది చెబుతున్నాడు.