డ్రగ్స్ ఉదంతం టాలీవుడ్‌ని కుదిపేస్తోంది. ఇప్పటికే 12 మంది పేర్లు బయటకు వచ్చాయి. రేపో మాపో మరికొందరికీ నోటీసులు అందే అవకాశం ఉంది. కొంతమంది విచారణకు సైతం హాజరయ్యారు. మరికొంతమంది విచారణ ఎదుర్కొనేందుకు సమాయాత్తం అవుతున్నారు. కెల్విన్ అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టేశారు. డ్రగ్స్ కేసులో వాళ్లకు కొన్ని కీలక ఆధారాలు, సమాచారం దొరికినట్టు తెలుస్తోంది. ఏ క్షణంలో అయినా అరెస్టులు జరగొచ్చని, సినీ పరిశ్రమకు చెందిన ఒకరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ 12మందిలో ఎవరిని అరెస్టు చేస్తారు?? వీళ్లు కాక కొత్త పేర్లు ఏమైనా బయటకు వస్తాయా? వాళ్లనీ అరెస్టు చేస్తారా?? అనే ఆసక్తి నెలకొంది. మొత్తానికి డ్రగ్స్ పాపం పండింది. ఈ మత్తులో కూరుకున్నవాళ్లు కటకటాల వెనక్కి వెళ్లక తప్పని పరిస్థితులు ఎదురైనట్టు తెలుస్తోంది.