అవసరాల శ్రీనివాస్ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు కూడా. నటన, దర్శకత్వం అనే రెండు పడవల మీద ప్రయాణం సాఫీగానే సాగిపోతోంది. దర్శకత్వంపై మోజుతో నటన వదిలేయడు, నటుడిగా బిజీ అయిపోయినందున దర్శకత్వంపై ఆలోచనలు మానేయడం ఇష్టం లేదంటాడు. అందుకే అవసరాల మిగతా వారితో పోల్చితే భిన్నమైన వ్యక్తి అన్పించుకుంటున్నాడు. బాలీవుడ్ 'హంటర్' రీమేక్ అయిన 'బాబు బాగా బిజీ' సినిమాలో నటిస్తున్న అవసరాల శ్రీనివాస్, ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందించిన 'అమీ తుమీ' సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రెండూ కామెడీ బేస్డ్ సినిమాలే. ఇందులో ఒకటి కాస్త అడల్ట్ కంటెంట్ ఉన్న చిలిపి కామెడీ అయితే, ఇంకోటి క్లీన్ కామెడీ. 'అడల్ట్ కంటెంట్' బాలీవుడ్ సినిమా 'హంటర్'లో ఉన్నమాట వాస్తవమే అయినా, తెలుగు వెర్షన్‌కి వచ్చేసరికి ఆ 'వేడి' కొంత తగ్గించేశారట. ఇంద్రగంటి సినిమా అయితే చాలా క్లీన్‌గా ఉంటుందని అవసరాల శ్రీనివాస్ అంటున్నాడు. ఏ సినిమా చేసినా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ దృష్టిలో పెట్టుకుంటానని చెబుతూ, అవకాశం వచ్చింది కదా అని ఏదో ఒక సినిమా చేసెయ్యడం తనకు ఇష్టం ఉండదని అన్నాడు ఈ విలక్షణ నటుడు. నటుడిగా ఛాలెంజింగ్ పాత్రల కోసం అవసరాల ఎదురుచూస్తున్నాడట. దర్శకత్వం మళ్ళీ త్వరలోనే ఉంటుందని సంకేతాలు పంపుతున్నాడు అవసరాల శ్రీనివాస్.