ప్రపంచ చలన చిత్ర చరిత్రలో అవతార్ ది ఓ ప్రత్యేకమైన స్థానం. జేమ్స్ కెమరూన్ అద్భుత సృష్టి అది. ప్రపంచ వ్యాప్తంగా వేల కోట్లు ఆర్జించి.. ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. అవతార్‌ని కొట్టే సినిమా ఇప్పటి వరకూ రాలేదు.
అవతార్ ని ఇటీవల రీ రిలీజ్ చేస్తే.. అప్పుడు కూడా మంచి వసూళ్లనే సాధించింది. ఇప్పుడు అవతార్ 2 వస్తోంది. ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇండియాలో కూడా భారీ ఎత్తున ఈ సినిమాని రీలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో కొనడానికి చాలామంది నిర్మాతలు ఎగబడుతున్నారు. కానీ రేటు చూసి `అమ్మో... ` అనేస్తున్నారు. దక్షిణాదిలో నాలుగు భాషల్లోనూ కలిపి దాదాపుగా రూ.150 కోట్లు కోట్ చేస్తున్నారట అవతార్ ప్రతినిధులు. నిజానికి అది చాలా చాలాపెద్ద మొత్తం. ఓ డబ్బింగ్ సినిమా, అందులోనూ హాలీవుడ్ డబ్బింగ్ సినిమాని రూ.150 కోట్లకు కొనడం చాలా పెద్ద రిస్క్. కాకపోతే... ఈ సినిమాకి మంచి హైప్ ఉంది. ఏమాత్రం బాగున్నా.. దాదాపు రూ.200 కోట్లు ఈజీగా వసూలు చేస్తుంది. ఎందుకంటే.. అవతార్ అనేది ఓ బ్రాండ్. ప్రతీ సినీ అభిమాని ఈ సినిమాని ఒక్కసారైనా చూడాలనుకొంటాడు. పైగా మల్టీప్లెక్సుల్లో తప్పకుండా ఆడేస్తుంది. త్రీడీ టెక్నాలజీలో చూడాలంటే మరింత రేటు. కాబట్టి... సినిమా బాగుందన్న టాక్ వస్తే మాత్రం రూ.200 కోట్లు రాబట్టడం పెద్ద మేటరేం కాదు. కానీ ఏమాత్రం తేడా కొట్టినా.. చాలామంది అడ్డంగా బుక్కయిపోతారు. అందుకే... ఈ సినిమా కొనడానికి బయ్యర్లు భయపడిపోతున్నారని టాక్.