‘నువ్వు కోపంగా వున్నా కామెడీనే కనిపిస్తుంది’ అని ఒక్క మాటతో బిగ్‌బాస్ రియాల్టీ షోలో ‘జబర్దస్త్’ అవినాష్ ఇమేజ్‌ని డ్యామేజీ చేసేశాడు బిగ్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున. ఆ తర్వాత అవినాష్, వివిధ టాస్క్‌ల సందర్భంగా ఎంత సీరియస్‌గా ఆడుతున్నా, కామెడీనే అయిపోతోంది. ఆఖరికి కెప్టెన్సీ టాస్క్‌లో అవినాష్ సత్తా చాటినా విలువ లేకుండా పోతోంది. అవినాష్‌ని బిగ్ హౌస్‌లో ఎవరూ సీరియస్ కంటెస్టెంట్‌గా భావించడంలేదు. ‘కమెడియన్ కదా, కామెడీ చేస్తున్నాడు.. అసలు కంటెస్టెంటే కాదు’ అన్నట్లుగా మిగతా కంటెస్టెంట్స్ వ్యవహరిస్తున్న తీరుని అవినాష్ సపోర్టర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక, ఈ వారం ఎలిమినేషన్ కోసం అవినాష్ కూడా నామినేట్ అయిన విషయం విదితమే. అవినాష్ ఇంకొన్ని వారాలు హౌస్‌లో కొనసాగుతాడా.? లేదంటే, త్వరగా ఎలిమినేట్ అయిపోతాడా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ, అవినాష్‌ని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కే బిగ్ హౌస్‌లో పరిమితం చేయడం, మిగతా కంటెస్టెంట్స్ అతన్ని ఎగతాళి చేస్తున్నా బిగ్‌బాస్ వారించకపోవడం, బిగ్ హోస్ట్ నాగార్జున కూడా అవినాష్‌ని కామెడీగా చూడటం ఇవన్నీ రియాల్టీ షో ఇమేజ్‌ని సైతం డ్యామేజ్ చేస్తున్నాయంటున్నారు. ఈ సీజన్ బిగ్‌బాస్ చూసేందుకు ఒకే ఒక్క కారణం అవినాష్ అని బిగ్‌బాస్ వ్యూయర్స్ చెబుతున్నా, ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నా, నిర్వాహకుల ఆలోచనల్లో మార్పు రాకపోవడం శోచనీయం.