2017లో హీరోగా నాని మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేశాడు. వరుసగా 'నేను లోకల్', 'నిన్ను కోరి', ఎంసీఏ' చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక 2018లో నాని నిర్మాతగానూ తన సత్తా చూపించనున్నాడు. నాని నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమానే 'అ'. కథ గురించి చిన్న క్లూ కూడా ఇవ్వకుండా, క్యారెక్టర్స్ పరిచయంతోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
కథ విన్న వెంటనే నాని ఈ సినిమాని ప్రమోట్ చేయాలని నిర్ణయించుకున్నాడట. అంతలా డైరెక్టర్ నానికి ఏం చెప్పి మెప్పించాడో అని అంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమా ఫస్ట్‌లుక్ విడుదలయ్యాకే నాని జడ్జిమెంట్ కరెక్ట్ అని తెలిసింది. టైటిల్ లోగో నుండి ప్రతీ పాత్రనూ పరిచయం చేయడంలోనే దర్శకుడి క్రియేటివిటీ అర్ధమయిపోతోంది. ఆ దర్శకుడిపై నాని పెట్టుకున్న నమ్మకానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు.
తెలుగు తెరపై ఇంతవరకూ ఓ హీరోయిన్ డిఫరెంట్ హెయిర్ కట్‌తో, ఒంటి నిండా టాటూలతో, ఏరోగెంట్ లుక్‌తో కనిపిస్తుందనీ ఎవరైనా ఆశించగలరా..? అందాల రెజీనాని ఆలా చూపించి అందరినీ షాక్‌కి గురి చేశారు. అవసరాల శ్రీనివాస్ పాత్ర కావచ్చు, ఇంకే ఇతర పాత్రైనా కావచ్చు, డిజైన్ చేసిన విధానంలో ఎంతో ప్రత్యేకత కనిపిస్తోంది. ఇంతవరకూ ఏ సినిమా కోసం ఇన్ని ఫస్ట్‌లుక్ డిజైన్స్ చేసి ఉండరేమో బహుశా. పాత్రల పరిచయాల డిజైన్సే ఇలా ఉంటే, ఇక సినిమాలో ఆ పాత్రల ఎలా ఉండబోతున్నాయో , అసలు ఇంకా ఈ సినిమాలో ఎన్ని పాత్రలున్నాయో, అవి ఇంకెలా ఉండబోతున్నాయో వాటిని ఇంకెంత కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారో అంటూ ఆశక్తి నెలకొంది. అందుకే 'అ' చిత్రం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది.
2018లో తెలుగు ప్రేక్షకులు అత్యంత ఉత్సుకతతో ఎదురు చూస్తున్న సినిమా ఇదే అని చెప్పడంలో సందేహం లేదు. ఇదేం చిన్న సినిమా కాదు. అంచనాల పరంగా భారీ సినిమాలానే ఉంది. కొత్త కాన్సెప్ట్, కొత్త ఆలోచన, కొత్త కొత్తగా కొత్త సంవత్సరంలోకి అడుగెడుతోంది. ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలిక.