నేచురల్ స్టార్ నాని సమర్పణలో తొలిసారిగా రూపొందుతోన్న చిత్రం 'అ'. ఇది అందరికీ తెలిసిందే. 'అ' అంటే ఆశ్చర్యం. అందుకే ఊహించని సన్నివేశాలతో ప్రతీ సీన్‌ని ఆశ్చర్యంగా ఫీలవుతాడట చూసే ప్రేక్షకుడు. షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా తన సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
తాను తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్స్‌తోనే తనలోని క్రియేటివిటీని గొప్ప గొప్ప వ్యక్తులు ఆకర్షించేలా చేశాడు ప్రశాంత్ వర్మ. ఆ టాలెంట్ అంతా రంగరించి తెరకెక్కిస్తున్న మూవీనే 'అ'. డైరెక్టర్‌గా అందరి దృష్టినీ తొలి సినిమాతోనే ఆకర్షించేశాడు ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్. ఏదో మామూలు లవ్ స్టోరీనో, లేక రెగ్యులర్ స్టోరీనో తెరకెక్కిస్తే కిక్కేముంటుంది. ఇంతవరకూ ఎవరికీ తెలీని కొత్తదనాన్ని చూపిస్తేనే కదా, తనకంటూ ప్రత్యేకతను చాటుకునేది. అలా ప్రిపేర్ చేసిన స్టోరీనే 'అ'.
స్టోరీ నచ్చి ఈ సినిమాలో నటించేందుకు కాజల్, రెజీనా, నిత్యామీనన్ వంటి స్టార్ హీరోయిన్లు ముందుకు వచ్చారు. అలాగే నాని కూడా స్టోరీ లైన్ విని ఈ చిత్రాన్ని తానే నిర్మించేందుకు ఒప్పుకున్నాడు. అలాగే ఈ సినమాలో తాను నటించకపోయినా స్పెషల్‌గా చేప క్యారెక్టర్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చి, నాని తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. బోన్సాయ్ మొక్కకు రవితేజ వాయిస్ ఇవ్వడం ఈ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్.
క్యారెక్టర్స్ పరిచయం ఇలా కూడా చేయొచ్చునంటూ ఇంతవరకూ ఏ డైరెక్టర్ చేయని ఆలోచన చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అందుకే ప్రతీ విషయంలోనూ మొదట్నుంచీ 'అ' ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. కాస్టింగ్ పరంగానే కాకుండా, బడ్జెట్ పరంగా కూడా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపే 'అ' ప్రేక్షకుల ముందుకు రానుంది.