ఈమధ్య తెలుగులో రీమేకుల జోరు పెరిగింది. అదే కోవలో ఓ రెండు మూడు నెలల నుంచి విపరీతంగా ప్రచారంలో ఉన్న పేరు మలయాళం సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'. ఈ సినిమాను తెలుగులో బాలయ్య - రానా కాంబినేషన్లో తెరకెక్కించాలని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు మొదట అనుకున్నారని వార్తలు వచ్చాయి. బాలయ్య స్వయంగా నేను నటించడం లేదని క్లారిటీ ఇవ్వడంతో మరో ఇద్దరు హీరోల పేర్లు వినిపించాయి.
ఫైనల్ ఈ సినిమాలో నటించేందుకు మాస్ మహారాజా రవితేజ - రానా దగ్గుబాటి ఓకే చెప్పారని అంటున్నారు. ఇదిలా ఉంటే దర్శకుడి విషయంలో కూడా ఎన్నో చర్చలు సాగుతున్నాయి. హరీష్ శంకర్, సుధీర్ వర్మ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఎందుకో ఆ దిశగా ముందుకు అడుగులు పడలేదేమో కానీ కొత్తగా మరో పేరు తెరపైకి వచ్చింది. సితార వారు ఈ రీమేక్ కోసం దర్శకుడు సాగర్ చంద్రతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. దాదాపుగా ఇతనే ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు.
'అయ్యారే', 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాలకు సాగర్ గతంలో దర్శకత్వం వహించాడు. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతా సవ్యంగా జరిగితే త్వరలో 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమా రీమేక్ సాగర్ దర్శకత్వంలో పట్టాలెక్కుతుంది.