'బాహుబలి ది కన్‌క్లూజన్' రికార్డులకు ఆకాశమే హద్దయ్యింది. వసూళ్ల సునామీ సాగుతూనే ఉంది. 1000 కోట్లే అద్భుతమైన రికార్డు అనుకుంటే, ఇక 1500 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటికే 1450 కోట్ల వసూళ్ళు దాటేసింది. అతి త్వరలో 1500 కోట్ల ఫిగర్‌ని టచ్ చేయబోతోంది. రెండు లేదా మూడు రోజుల్లోనే ఆ అద్భుతాన్ని 'బాహుబలి ది కంక్లూజన్' దాటేయనుందట. ఓ తెలుగు సినిమా ఇంతటి విజయం సాధించడం మహాద్భుతం. ఈ మహాద్భుతానికి కారకుడు దర్శక ధీరుడు రాజమౌళి. 'బాహుబలి ది కంక్లూజన్' సినిమాని భారతీయ సినిమాగా బాలీవుడ్ సైతం అక్కున చేర్చుకుంది, ఈ సినిమా విజయాన్ని చూసి ఆశ్చర్యపోయింది. బాలీవుడ్‌లో ఇంతకు ముందు వరకూ అత్యధిక వసూళ్ళు సాధించిన 'దంగల్' సినిమాని ఓ తెలుగు సినిమా డబ్బింగ్ వెర్షన్ దాటేయడం ఓ చరిత్ర. ఈ ఘనత నభూతో న భవిష్యతి. ఇంతటి ఘన చరిత్రను తెలుగు సినిమాకి అందించిన రాజమౌళికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఈ సినిమాలోని పాత్రలు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయాయంటే ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరిది ఎంతటి మహాభాగ్యమో వేరేగా చెప్పనక్కర్లేదు. విడుదలకి ముందు ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. కానీ ఇంత భారీగా ఉంటాయనీ చిత్ర యూనిట్ కూడా ఊహించి ఉండదు. రాజమౌళి వంటి దర్శకుడు మన తెలుగు వాడు కావడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించక తప్పదు.