చైనాలో బాహుబలి సినిమాని విడుదల చేయబోతున్నారు. తొలి పార్ట్ 'బాహుబలి ది బిగినింగ్' చైనాలో అంచనాల్ని అందుకోలేకపోయింది. అక్కడ విఫల ప్రయోగంగా మిగిలిపోయింది. అయితే ఈసారి 'బాహుబలి ది కంక్లూజన్' మాత్రం అక్కడ సూపర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మొదటి భాగంలో సన్నివేశాల్ని రెండో భాగంలో అక్కడక్కడా కలపడం, అదే సమయంలో ఎక్కడా సెకెండ్ పార్ట్‌లో కన్‌ఫ్యూజన్ లేకుండా చేయడం వంటి చర్యలను చేపట్టారని సమాచారమ్. బాలీవుడ్ 'దంగల్' చైనాలో దాదాపు 800 కోట్లు వసూలు చేసింది. చైనా కాకుండా 'బాహుబలి ది కంక్లూజన్' ఇప్పటికే 1500 కోట్ల వసూళ్ళను దాటేసింది. 'దంగల్' స్థాయిలో గనుక 'బాహుబలి' వసూలు చేస్తే 2000 కోట్లు అంతకు మించి 'బాహుబలి' వసూలు చేయవచ్చు. చైనాలో 'దంగల్' విజయాన్ని దృష్టిలో పెట్టుకుని 'బాహుబలి ది కన్‌క్లూజన్' టీమ్ ఈ ఆలోచనకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి ది కన్‌క్లూజన్' విజయం సాధించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మరి చైనాలో కూడా అదే విజయాన్ని అందుకుంటే, ఇక ఈ సినిమా రికార్డుల్ని అందుకోవడం మరే సినిమా వల్ల కాకపోవచ్చు కూడా. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే 'బాహుబలి' తన సత్తా చాటింది. ఇక చైనాలో తన సత్తా చాటేందుకు రంగం సిద్ధమవుతోందన్న మాట. పోటా పోటీగా సాగుతోన్న వసూళ్ల పోరులో 'దంగల్', బాహుబలి' ఈ రెండు సినిమాలు ఏ ఫిగర్ వద్ద ఫుల్ స్టాప్ పెడతాయో చూడాలిక.