తమిళనాడులో చిన్నపాటి సమస్య 'బాహుబలి ది కంక్లూజన్'ని కొంచెం భయపెట్టింది. కారణమేమిటంటే అక్కడ ఏస్ అనే సంస్థ, తమకు శ్రీగ్రీన్ సంస్థ నుంచి 1.18 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నందున, 'బాహుబలి ది కంక్లూజన్' సినిమా విడుదలను ఆపేయాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆ రెండు సంస్థల మధ్య 'బాహుబలి' ఆర్థిక లావాదేవీలు సమస్యను జఠిలం చేశాయి. అయితే సినిమా విడుదల ఆపేయాలన్న ఏస్ సంస్థ కోరికను న్యాయస్థానం మన్నించలేదు. ఏస్ సంస్థ ఫిర్యాదు మేరకు శ్రీగ్రీన్ సంస్థకు మాత్రం న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం నుంచి బయటపడ్డందుకు 'బాహుబలి ది కంక్లూజన్'కి ఊరట లభించినట్లే భావించవలసి ఉంటుంది. ఎక్కువగా తమిళనాడులోనే ఇటువంటి వివాదాలను చూస్తుంటాం. ప్రముఖ హీరోలకు సంబంధించిన సినిమాలు కూడా ఇలాంటి వివాదాలకు మినహాయింపు కాదు. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారతీయ సినిమా సత్తా చాటేలా 'బాహుబలి ది కంక్లూజన్' సినిమా రూపొందింది. ఈ సినిమాకి తమిళనాడులో వివాదం చాలా చాలా చిన్నదే కావొచ్చు. అయితే కర్నాటలో మాత్రం వివాదం అలాగే ఉంది. కావేరీ జలాలపై 'కట్టప్ప' సత్యరాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో 'బాహుబలి ది బిగినింగ్'పై కొందరు కన్నడిగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కన్నడిగులు అర్థం చేసుకోవాల్సింది 'కట్టప్ప' పాత్రలో సత్యరాజ్ నటించినంతమాత్రాన సినిమాని అడ్డుకోవడం సబబు కాదని.