2017 బాలీవుడ్‌కి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాదిలో చాలా పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. కానీ, వాటిల్లో చాలావరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినవే. అయితే, ఈ ఏడాది 'బాహుబలి' హిందీ వెర్షన్ బాలీవుడ్‌ని ఆదుకుంది. వసూళ్ళ సునామీ సృష్టించింది. ఈ సినిమా బాలీవుడ్‌లో విడుదలై సంచలనాత్మక విజయాన్ని అందుకోవడమే కాకుండా, బాలీవుడ్ మన తెలుగు సినిమా పరిశ్రమని ఆశ్చర్యంగా చూసేలా చేసింది. వసూళ్ల పరంగా అక్కడ రికార్డులు సృష్టించింది 'బాహుబలి'. ఓ డబ్బింగ్ సినిమా హిందీలో ఓ మోస్తరు విజయాన్ని అందుకోవడమే కష్టం. అలాంటిది 'బాహుబలి' ఏకంగా ఈ స్థాయిలో విజయం సాధించింది.
అంతేకాదు బాలీవుడ్‌లో స్ట్రెయిట్ హిందీ సినిమాలు సృష్టించిన గత రికార్డుల్ని తుడిచి పెట్టేసింది 'బాహుబలి' సినిమా. బాలీవుడ్‌కి సంబందించి 2017లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'బాహుబలి' రికార్డుకెక్కింది. తొలి రోజు, తొలి వారం, ఇలా ప్రతీ రికార్డునీ 'బాహుబలి' తన పేర రాసుకుంది. 500 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి ఇండియన్ సినిమా.. 100ఏ కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకున్న తొలి ఇండియన్ సినిమా రికార్డుల్నీ 'బాహుబలి' తన ఖాతాలో వేసుకుంది. 'బాహుబలి'తో పాటు 'జుద్వా - 2', 'ఫక్రే రిటర్న్స్', గోల్‌మాల్ ఎగైన్', 'టైగర్ జిందా హై' తదితర చిత్రాలు ఈ ఏడాదిలో బాలీవుడ్ హిట్స్‌గా నిలిచాయి.
కానీ అవేవీ 'బాహుబలి' ఫస్ట్ డే రికార్డుల్నీ టచ్ చేయలేకపోయాయి. ఓ తెలుగు సినిమాకి దక్కిన అరుదైన గౌరవం ఇది. అంతే కాదు ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన చిత్రంగా 'బాహుబలి' గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారిప్పుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రబాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.