బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న 'జై సింహా' సినిమా షూటింగ్ పూర్తయ్యింది. గుమ్మడికాయ కొట్టేశారు. ఇప్పుడు బాలయ్య తన తదుపరి చిత్రం పనుల్లో బిజీ అయిపోయాడు. తేజ డైరెక్షన్లో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించనున్నారన్న సంగతి తెలిసిందే. 'ఎన్టీఆర్' అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమా షూటింగ్ కోసం బాలయ్య ఎన్టీఆర్ గెటప్ వేశారు. అయితే ఇది సినిమా కోసం కాదు. జస్ట్ టీజర్ షూట్ కోసం మాత్రమే. ఈ టీజర్ కోసం తేజ గత వారం పది రోజుల నుండీ స్కెచ్ ప్లాన్ చేస్తున్నాడట. టీజర్ అద్భుతంగా రూపొందించనున్నాడట.
జనవరి 18న ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు. టీజర్లో ఎన్టీఆర్ గెటప్‌లో బాలయ్యని చూసి అభిమానులు ఆనందంతో పండగ చేసుకుంటారంటున్నాడు తేజ. అంత బాగా బాలయ్య గెటప్‌ని తీర్చి దిద్దుతున్నారట. అయితే ఈ సినిమాకి సంబంధించిన గెటప్ ఇతరత్రా విషయాలను సీక్రెట్‌గా మెయింటైన్ చేయనున్నారనీ తెలుస్తోంది. ఈ సినిమా కథ కోసం చాలా రీసెర్చ్ చేశారు. ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానంలోని ముఖ్య అంశాలను తెరపై చూపించనున్నారు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో తేజ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ చాలా పవర్ ఫుల్‌గా సిద్ధం చేసి ఉంచాడు.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ బయోపిక్‌తో మరో రెండు చిత్రాలు రూపొందనున్నాయన్న సంగతి విదితమే. వాటిలో ఒకటి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' కాగా, మరొకటి లక్ష్మీస్ వీరగ్రంధం'. వీటిలో 'లక్ష్మీస్ వీరగ్రంధం' కొంచెం ముందుకెళ్తోంది. కానీ వర్మ తెరకెక్కించబోయే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి సంబంధించి మాత్రం న్యూస్ లేదు. ప్రస్తుతం వర్మ 'కడప' వెబ్ సిరీస్‌తోనూ, మరో పక్క నాగార్జున సినిమాతోనూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నాడట. బాలయ్య 'ఎన్టీఆర్' పట్టాలెక్కగానే ఈ రెండు సినిమాలూ కూడా జోరందుకునే అవకాశాలున్నాయి.