బాహుబలిని మహాభారతంతో ఎందుకు పోల్చానంటే!

మరిన్ని వార్తలు

నేను "బాహుబలి" ని "మహాభారతం"తో పోల్చి పెట్టిన ట్వీట్ కొందరికి నచ్చలేదు. అది సహజం. ఎందుకంటే నేను ఏది ఆలోచించి ఆ పోలిక పెట్టానో వారికి తెలియదు కనుక. తెలిపినా, వారిలో కొందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఎవరికి ఏది కంఫర్ట్ అనిపిస్తుందో అదే నచ్చుతుంది.

మొదటిగా బాహుబలిలో లూజ్ ఎండ్స్ గురించి ఒక చర్చ.

1. భల్లాలదేవ భార్య ఎవరు?
2. మొదటి భాగంలో పెద్ద హడావిడిగా కనిపించిన అస్లాం ఖాన్ ని (సుదీప్) సెకండ్ హాఫులోకి రాజమౌళి మళ్ళీ ఎందుకు తీసుకురాలేదు?- ఇలాంటివి.

ఈ లూజ్ ఎండ్స్ అనేవి ఎపిక్స్ లో కూడా ఉంటాయి. కౌరవుల్లో ఇద్దరికే ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా 98 మందిని వృధాగా వ్యాసుడు ఎందుకొదిలేశాడు?... శత్రుఘ్నుడికి, ఆయన భార్య శృతకీర్తికి కావ్యంలో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాల్మీకి ఎందుకు వదిలేశాడు?- అంటూ రామాయణభారతాల్లో కూడా లూజ్ ఎండ్స్ ని ఎనలైజ్ చేయొచ్చు.

అసలు రామాయణమంతా విన్నా సీత తల్లి ఎవరంటే, "భూదేవి" అంటాం. అంటే జనకుడి భార్య భూదేవి కాదుగా! సునయన అని ఒకావిడ ఉంది. ఆవిడ సీతను పెంచిన తల్లి. ఆ పాత్ర సినిమాల్లో కనపడదు. అలాగని లేదని కాదు.

బాహుబలి ఒక ఫిక్షన్. కానీ కథను చెప్పే తీరు "ఇది నిజంగా జరిగిందా" అనిపించేలా ఉంటే దానికి ఇతిహాసం స్టాండర్డ్ వచ్చే అవకాశం ఉంది. కాలగమనంలో ఎవరో చెబితే తప్ప జనానికి ఏది నిజమో, ఏది ఫిక్షనో తేడా తెలుసుకునే పరిస్థితి ఉండదు. "మాయబజార్"లో మనం చూసిన కథ మహాభరతంలో లేదు. అది పూర్తి ఫిక్షన్ కథ. మహాభారతంలోని పాత్రలు కనిపించాయి కాబట్టి నిజమని నమ్మినవాళ్లూ ఉన్నారు.
బాహుబలిని సినిమాతో ఆపకుండా టీవీ సిరీస్ చేసే ఆలోచన ఉందని విన్నాను. అలాంటి ఆలోచన నిజం అయితే బాహుబలిని సినిమా స్థాయి నుంచి పెంచి పెద్ద చేస్తున్నట్టే కదా!

బాహుబలి కథ మీద ఆసక్తి ఉంటే ఆనంద్ నీలకంటన్ రాసిన "రైజ్ ఆఫ్ శివగామి" చదవచ్చు. అందులో శివగామి నేపధ్యం ఉంది. సినిమాలో కనపడని చాలా పాత్రలు కనిపిస్తాయి. అది ఎలాబరేటెడ్ కథ అనుకోవచ్చు. అలాగే ఆ రైటర్ నుంచే మరో రెండు భాగాల్లో బాహుబలి చరిత్ర మొత్తం వస్తోంది. అదే పూర్తయ్యాక టీవీ సిరీస్ గా రాబోతోంది.

మనం బాహుబలి సినిమాలో చూసింది బీజప్రాయంగా ఉన్న కథ. దానిని మహాభారతమంత పెద్దది చేసుకోవచ్చు. ఎన్నో విలువలు చూపించొచ్చు. మాట తప్పని అమరేంద్రబాహుబలి, లాయల్టీకి కట్టుబడి ఉండే కట్టప్ప...ఇలాంటి విషయాలు మహాభారత పాత్రలతోటే కాకుండా మరిన్ని పాత్రలు సృష్టించి చూపించే పనిని స్వాగతించడంలో తప్పులేదుగా!

అందుకే అన్నాను బాహుబలికి మహాభారతానికి ఉన్నంత స్కోప్ ఉందని (ఇంకా విపులీకరిస్తున్నారు కాబట్టి...)! - అయితే పెద్దగా ఉన్న మహాభారత కావ్యాన్ని కుదించి సినిమాలుగా తీసుకున్నాం. ఇక్కడ కుదించి ఉన్న బాహుబలి సినిమాని పెద్దది చేసి కావ్యాలుగా మార్చుకుంటున్న వైనం చూస్తున్నాం. రివెర్స్ ఇంజనీరింగ్ అన్నమాట:-)

బాహుబలిని పుస్తకాల రూపంలో సాహిత్యంలోకి తీసుకురావడం, టీవీ సిరీస్ రూపంలో అంతటి పెద్ద సాహిత్యాన్ని దృశ్యరూపంలోకి మార్చడం, మరో పక్క కామిక్స్ రూపంలోకి తీసుకువెళ్ళడం..ఇదంతా బాహుబలిని ఎపిక్ గా మార్చే ప్రక్రియే!

"మాహాభారతంలో లేనిది బయట లేదు. బయట లేనిది మహాభారతంలో ఉండదు"..అనే వాక్యం చాలమంది వినే ఉంటాం. అది సత్యం. ఏ కథ ఎత్తుకున్నా ఎపిక్స్ లో ఎక్కడో అక్కడ ఆ కథాంశం ఉంటుంది. తప్పదు...అలాగని కొత్త ఎపిక్స్ ని తయారుచేసే శక్తి, ఆసక్తి ఉన్నవాళ్లు ఆగరుగా!

ఒక తెలుగు సినిమా విడుదలని జాతీయ ఉత్సవంలా ప్రపంచంలో ఉన్న చాలామంది భారతీయులు పరిగణించారంటే అది విజయేంద్రప్రసాద్, రాజమౌళిగార్ల గొప్పతనం.

ఇంత చెప్పినా నా పోలిక నచ్చకపోతే...చెప్పానుగా..ఎవరికి కంఫర్ట్ అనిపించింది వాళ్లు నమ్మే హక్కుని నేను కాదనలేను:-)

స్వస్తి.
-సిరాశ్రీ


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS