కమ్మ అన్న పదం ఓ కులానికి సంబంధించినది మాత్రమే కాదు. అలాగే కాపు అనే పదం కూడా. 'కటిక' అనే పదం ఇప్పుడు కొత్తగా వివాదాస్పదమవుతోంది. 'కమ్మనైన' అనే పదంలో 'కమ్మ' ఉంటుంది కాబట్టి, 'కమ్మనైనా' అని ఎక్కడా వాడకూడదు. 'కాపు' ఉంది కాబట్టి 'కాపుకాసే' అనే మాట ఉపయోగించరాదు. 'కటిక' మనోభావాల్ని దెబ్బతీస్తుంది కాబట్టి 'కటిక చీకటి' అనకూడదంటే ఎలా? తెలుగు భాష చాలా అందమైనది. అందులో ఒక్కో పదాన్ని ఒక్కోరకంగా వాడుకోవచ్చు. ఎంత చక్కగా వాడితే అందులో అందం అంతగా ఎలివేట్ అవుతుంది. సినిమా టైటిల్స్ దగ్గర్నుంచి సినిమాల్లో డైలాగ్స్ వరకూ చాలా చాలా పదాలు వాడటం జరుగుతుంటుంది. కానీ ఇకపై అలాంటి పదాలే వాడకూడదంటే భవిష్యత్తులో మూకీ సినిమాలే తీసుకోవాలి. అసలింతకీ ఈ పదాల గోలేంటి అనుకుంటున్నారా? ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోన్న 'బాహుబలి' సినిమాలో 'కటిక చీకటి' అనే ప్రస్తావన ఉన్నదట. ఈ పదం ఇంత వరకూ చాలా సినిమాల్లో ప్రస్తావించడం జరిగింది. తాజాగా ఈ పదం ప్రస్తావన సినిమాల్లో ఉండకూడదంటూ కొత్తగా వివాదం చెలరేగింది. అసలు మన తెలుగు భాషకి ఇంతగా తెగులు పట్టించిందెవరు? ఎందుకీ దుస్థితి పట్టింది. సినిమాల్లో పలు రకాల పదాల నిషేధం విధించాలనే వదంతులు ఎంతవరకు సబబు? ఏమో ఈ ప్రశ్నకు బదులు చెప్పేదెవరో!