'బాహుబలి 2' సినిమా వచ్చేస్తోంది. 'ది కంక్లూజన్' అంటూ బాహుబలి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెలాఖరుకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించిన చర్చే జరుగుతోంది. సాధారణంగా తెలుగు సినిమాల గురించి పట్టించుకోని నేషనల్ మీడియా 'బాహుబలి -2' గురించి చాలా గొప్పగా మాట్లాడుతుండడం తెలుగువారిగా మనందరం గర్వించదగ్గ అంశం. ప్రభాస్, రాణా నేషనల్ మీడియా ముందుకు వెళ్ళి తమ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్యనే 'బాహుబలి' టీమ్ చెన్నయ్‌లో ఆడియో విడుదల వేడుక సందర్భంగా సందడి చేసింది. కర్నాటకలో మాత్రం 'బాహుబలి'పై వివాదం నడుస్తోంది. సత్యరాజ్ కారణంగా ఈ సినిమాని అడ్డుకునేందుకు కన్నడికులు ప్రయత్నిస్తున్నారు. అయితే సినిమా విడుదలయ్యేనాటికి ఆ వివాదం సద్దుమణిగిపోవచ్చు. బాలీవుడ్ గురించి మాట్లాడుకొస్తే కరణ్ జోహార్ అక్కడ ఈ సినిమాని మార్కెట్ చేస్తున్నారు. దాంతో సినిమా ప్రమోషన్‌లో ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుండడం జరుగుతోంది. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన కరణ్ జోహార్, ఓ తెలుగు సినిమాని జాతీయ స్థాయి సినిమాగా, ప్రపంచ స్థాయి సినిమాగా అభివర్ణించడమంటే చాలా చాలా అరుదైన సందర్భం. 'మేం బాహుబలి కోసం ఎదురుచూస్తున్నాం' అని బాలీవుడ్ ప్రేక్షకులు మీడియా ముందు సోషల్ మీడియా ముందూ నినదిస్తుండడం బాహుబలి మేనియాకి నిదర్శనంగా చెప్పుకోవాల్సి ఉంటుంది.