‘బలగం’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. 67 ఏళ్ల మొగిలయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బలగం సినిమా విజయంలో క్లైమాక్స్ కీలకం. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన బలగం క్లైమాక్స్‌లో మొగిలయ్య ఎమోషనల్ సాంగ్ ప్రేక్షకులని హత్తుకుంది.
కొన్ని రోజులుగా మొగిలయ్య కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మొగిలయ్య చికిత్స కోసం ప్రముఖ నటుడు చిరంజీవి, బలగం దర్శకుడు వేణు పాటు పలువురు ఆర్థికసాయం చేశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని సంరక్ష ఆస్పత్రికి ఆయన్ను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు.
మొగిలయ్య మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జానపద కళారూపం ‘శారద కథల’కు బహుళ ప్రాచుర్యం కల్పించి, ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ బాధాకర సమయంలో మొగిలయ్య సతీమణి కొమురమ్మతోపాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.