సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బూతుల దండకంతో విరుచుకుపడిపోయారు. ప్రత్యేక హోదా కోసమంటూ తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడలో 12 గంటల ధర్మ పోరాట దీక్షలో బాలకృష్ణ ఆవేశంతో ఊగిపోతూ, వచ్చీ రాని హిందీలో బూతులు తిట్టేస్తోంటే అక్కడికి హాజరైన వందలాదిమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే షాక్‌కి గురయ్యారు.
అసలే తెలుగు సినీ పరిశ్రమలో శ్రీరెడ్డి అనే నటి బూతుల దండకం కలకలం రేపుతోంది. పవన్‌కళ్యాణ్ మీద ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల్ని చేయించి బుక్కయిన రామ్‌గోపాల్ వర్మ ఉదంతంతో తెలుగు సినిమా పరిశ్రమ ప్రజల్లో చులకనైపోయింది. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ రాజకీయ వేదికపైనుంచి బూతులు తిట్టడం, అది కూడా ప్రధాన మంత్రిని తిట్టడం వివాదాస్పదంగా మారింది. బాలకృష్ణపై కేసులు బుక్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు డెడ్‌లైన్ కూడా విధించింది బాలకృష్ణకు భారతీయ జనతా పార్టీ.
సినిమాల్లో పవర్‌ఫుల్ డైలాగులకి అభిమానుల నుంచి కేరింతలు వస్తాయి సినీ హీరోలకి. అదే నిజమనుకుని, రియల్ లైఫ్‌లో సినీ ప్రముఖులు నోరు జారడం సబబు కాదు. సినీ నటుడిగా తన సినిమాల షూటింగ్స్ సందర్బంగా షూటింగ్ సిబ్బందిపై చేయి చేసుకోవడం, బూతులు తిట్టడం బాలకృష్ణకి అలవాటే. అభిమానుల్ని సైతం ఆయన కొడుతుంటారు. దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో బాలయ్య గూబ పగలగొడితే, అది అభిమానులకి పండగేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్ళే సినీ ప్రముఖులెవరైనా సినీ పరిశ్రమకు కళంకం తీసుకురాకుండా వ్యవహరించాల్సి వుంటుంది.