ఆదిత్య 369 సినిమాకి రీమేక్‌గా ఆదిత్య 999 చేయాలన్నది బాలకృష్ణ కల. ఆయన కలల ప్రాజెక్టులలో ప్రధమ స్థానంలో ఉంటుందీ సినిమా. బాలయ్య వందో సినిమాగా ఆదిత్య 999 వస్తుందని అంతా అనుకున్నారు. కానీ సడన్‌గా గౌతమి పుత్ర శాతకర్ణి ట్రాక్ ఎక్కేసింది. అప్పటి నుంచీ ఈ సీక్వెల్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ కథని తనయుడు మోక్షజ్ఞ కోసం బాలయ్య త్యాగం చేశాడని టాక్. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం భారీ కసరత్తులు జరుగుతున్నాయి. ఓ మంచి కథతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని బాలయ్య మొన్నామధ్యే చెప్పాడు. ఆ కథ ఆదిత్య 999 అని తెలుస్తోంది. నిజానికి ఆదిత్య 999 సినిమా బాలయ్య చేస్తే, ఆ సినిమాలో మోక్షజ్ఞ ఓ చిన్న పాత్రలో కనిపిస్తాడని, దాంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుందని భావించారు. కానీ ఇప్పుడు కొత్త ప్లాన్ ప్రకారం.. సినిమాలో హీరో మోక్షజ్ఞనే. బాలయ్యే ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ఆ రకంగా స్క్రిప్టు మారుస్తున్నారని టాక్. ఆదిత్య 999 ఎప్పుడొచ్చినా, అది నందమూరి వారసులే చెయ్యాలి. అప్పుడే ఆ ప్రాజెక్టుకి అందం, ఆకర్షణ.