నందమూరి బాలకృష్ణకు వరుసగా ఫ్లాపులు తగులుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో వచ్చిన రెండు సినిమాలూ ఫ్లాపయ్యాయి. రూలర్ కూడా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. ఇప్పుడు ఓ హిట్టు కొట్టడం బాలయ్యకు అత్యవసరం. అందుకే బోయపాటి శ్రీనుతో సినిమాకి సై అన్నాడు. వీరిద్దరిదీ విజయవంతమైన కాంబినేషన్. అందుకే ఈ సినిమాపై నందమూరి అభిమానులు సైతం అంచనాలు పెంచుకున్నారు. తప్పకుండా ఈ సినిమాతో ఈ జోడీ హ్యాట్రిక్ అందుకుంటుందన్నది వాళ్ల నమ్మకం.
అయితే ఇప్పుడు ఓ షాకింగ్ లాంటి వార్త బయటకు వచ్చింది. అదేంటంటే... ఈ సినిమాలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నాడట. అయితే పూర్తి స్థాయి పాత్ర కాదు. కొన్ని సన్నివేశాల్లో మాత్రమే బాలయ్య ఆ అవతారంలో దర్శనమిస్తాడట. ఈ సినిమాకి చాలా కీలకమైన అంశం ఇదేనని టాక్. అఘోరా అవతారాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగ్నంగా, ఒళ్లంతా బూడిద పోసుకుని, భారీగా గెడ్డాలు పెంచుకుని దర్శనమిస్తారు. ఆ అవతారంలో బాలయ్యని చూడగలమా? అన్నది పెద్ద అనుమానం. ఈ వార్తే నిజమైతే, బాలయ్య అభిమానుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో మరి? మొత్తానికి బాలయ్యతో బోయపాటి గట్టి ప్రయోగమే చేస్తున్నట్టు కనిస్తోంది.