గతంతో పోలిస్తే ఇప్పుడు బాలయ్య ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అఖండ లాంటి ఘన విజయం, అన్ స్టాపబుల్ కార్యక్రమం బాలయ్యకు కొత్త ఇమేజ్ తీసుకొచ్చాయి. వేదికలపై బాలయ్యకు మాట్లాడడం పెద్దగా రాదు. ఒక టాపిక్ నుంచి మరో టాపిక్ కి జంప్ అయిపోతుంటాడు. అవసరం లేని విషయాలు ఎక్కువగా ప్రస్తావనకు వస్తుంటాయి. అయితే అన్ స్టాపబుల్ చూశాక.. బాలయ్య మాటకారే అనే విషయం అర్థమైంది. బాలయ్య సమయస్ఫూర్తి, ఛలోక్తులకు అభిమానులు పుట్టుకొచ్చారు. అయితే వేదికపై మాట్లాడే విషయంలో బాలయ్య ఇంకా అక్కడే ఉన్నాడు. ఎప్పటిలానే సమయం సందర్భం లేకుండా, తన స్పీచులతో విసిగిస్తున్నాడు. తాజాగా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో అదే జరిగింది. మాటల సందర్భంలో `అక్కినేని... తొక్కినేని` అంటూ ఏఎన్నార్ పేరుని తిక్క తిక్కగా పలికి అక్కినేని అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. నిజానికి ఈ వేదికపై అక్కినేని ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరమే లేదు. కానీ.. బాలయ్య లూజ్ టంగ్ తో.. విమర్శల పాలవుతున్నాడు.
అక్కినేని కుటుంబంతో బాలయ్యకు సత్సంబంధాలు లేవు. నాగార్జునతో ఎప్పటి నుంచో అంటీ ముట్టనట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. అప్పట్లో ఎన్టీఆర్ - ఏఎన్నార్ ఎంత సఖ్యతగా ఉండేవాళ్లో, ఇప్పుడు బాలయ్య, నాగ్ మధ్య అంత దూరం పెరుగుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలు వారి బంధానికి అడ్డు గోడలు వేసేలానే ఉన్నాయి. కాకపోతే... సమయం సందర్భం చూసుకోకుండా ఎంత మాటైనా అనేయడం బాలయ్య లాంటి నటులకు పరిపాటి కాదు. ఈ విషయంలో బాలయ్య మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.