చిత్రం: డాకు మహారాజ్
దర్శకత్వం: బాబీ కొల్లి
కథ - రచన : బాబీ కొల్లి
నటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, ఊర్వశీ రౌటేలా , రీష్మా నానయ్య, బాబీ డియోల్, చాందినీ చౌదరీ, సచిన్ ఖేడేకర్, హిమజ, హర్ష వర్ధన్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: నిరంజన్ దేవరమానే
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా
విడుదల తేదీ: 12 జనవరి 2025
ఐక్లిక్ మూవీస్ రేటింగ్: 2.75/5
ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
నందమూరి నటసింహం బాలయ్య ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఒక వైపు రాజకీయాల్లోనూ, మరో వైవు సినిమాల్లోనూ హ్యాట్రిక్స్ తో దూసుకుపోతున్నారు. ఈ సంక్రాతి బరిలో డాకు మహారాజ్ మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న బాబీ ఇప్పుడు బాలయ్యతో మరొక హిట్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, పాటలు అన్నీ అంచనాలను మించి ఉన్నాయి. డాకు మహారాజుపై మొదటి నుంచి పాజిటీవ్ వైబ్స్ ఉన్నాయి. ఈ క్రమంలో బాలయ్య డాకు మహారాజుగా అలరించాడా లేదా? సంక్రాంతి రేసులో బాలయ్య డాకు హిట్ అయ్యిందో లేదో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
సినిమా 1996 లో జరిగిన కథతో ప్రారంభం అవుతుంది. మదనపల్లి హిల్ స్టేషన్ లో ఓ జమిందారీ కుటుంబం ఉంటుంది. ఈ కుటంబానికి చెందిన ఎస్టేట్ ని లీజుకు తీసుకుని ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు (రవికిషన్) , అతని తమ్ముడు మనోహర్ నాయుడు అక్రమాలు చేస్తూంటారు. టీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం, ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేస్తుంటారు. ఈ విషయం తెలిసిన ఎస్టేట్ ఓనరు త్రిమూర్తుల నాయుడికి అడ్డుపడతాడు. ఆ కక్షతో ఆ ఫ్యామిలీకి చెందిన ఓ చిన్న పాపని రవికిషన్ గ్యాంగ్ టార్గెట్ చేస్తారు. ఆ పాప ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఫోన్ రావడంతో ఆ చిన్నారి దగ్గరకు బాలయ్య బయిలుదేరతాడు. ప్రమాదంలో ఉందని ఫోన్ వచ్చిన ఆ ఇంటికి వెళ్లి బాలయ్య డ్రైవర్‌గా చేరుతాడు. తనను నానాజీగా పరిచయం చేసుకుని ఆ ఇంటివారికి దగ్గరై పాపని కంటికి రెప్పలా కాపాడు తూంటాడు. ఇంకోవైపు ఎన్కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రాజ్ (షైన్ టామ్ చాకో) 'డాకు ఎక్కడ?' అని వెతుకుతూ ఎస్టేట్ గురించి తెలుసుకుంటాడు. నానాజీని ఎదిరించి ఆ కుటుంబాన్ని, పాపని రవికిషన్ ఏమీ చెయ్యలేకపోవటంతో ఠాకూర్( బాబీ డియోల్) రంగంలోకి దిగుతాడు. కారణం ఎస్టేట్ లో ఉన్న తమ మాల్ ని తీసుకెళ్లటం కోసం ఠాకూర్ ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలో ఠాకూర్ కు బాలయ్య గురించి ఓ నిజం తెలుస్తుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రాజ్ కు కూడా బాలయ్య ఎవరో, తెలుస్తుంది. ఎస్టేట్ లో ఉన్న నానాజీనే డాకూ మహారాజ్ అని తెలుసుకుంటాడు. అసలు ఈ డాకూ మహారాజ్ ఎవరు? డాకుకి ఆ పాప కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? అంతటి పాపులర్ వ్యక్తి ఒక సాధారణ డ్రైవర్ గా ఎందుకు జాయిన్ అయ్యాడు? బాబీ డియోల్ కు బాలయ్యతో ఉన్న గొడవేంటి? ప్రగ్య జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ పాత్రలు ఏంటో తెలియాలంటే డాకు మహారాజ్ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు బాబీ రాసుకొన్న కథ పాతదే అయినా, బాలయ్య ఫాన్స్ కి కిక్ ఇచ్చేలా తీర్చిదిద్దాడు. పక్కా కమర్షియల్ హంగులతో ఈ మూవీని తెరకెక్కించాడు బాబీ. ఈ మూవీలో బాలకృష్ణ బాడీలాంగ్వేజ్, యాటిట్యూడ్ సూపర్ గా ఉంది. మాస్ ఎలివేషన్స్ తో పాటు స్టైలిష్ గా కూడా ఆకట్టుకున్నారు బాలయ్య. ఇది వరకు చాలా సినిమాల్లో డ్యూయెల్ రోల్ లో నటించిన బాలయ్య డాకు మహారాజ్ లో మరొకసారి డ్యూయెల్ రోల్ లో మెప్పించారు. నానాజీ, సీతారాం పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఒక పాప ప్రాణాలు కాపాడే నేపథ్యంలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఫైనల్ గా సంక్రాంతికి ప్రేక్షకుల్ని అలరించటంలో బాలయ్య- బాబీ సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు.
బాలయ్య నుంచి ఆడియన్స్ ఏమి ఆశిస్తారో అవన్నీ డాకు మహారాజ్ లో ఉన్నాయి. బాలయ్య మార్క్ డైలాగ్స్, మంచి కిక్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు, గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్ సీక్వెన్స్ లు అన్నిటితో ఫుల్ మీల్స్ పెట్టారు. బాలయ్య గత మూడు సినిమాల తరహాలోనే ఈ మూవీ కూడా ఉంది. యానిమల్ మూవీ తరవాత బాబీ డియోల్ మరొకసారి గుర్తింపు తెచ్చే పాత్ర చేసాడు. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ వేస్ట్ అనిపిస్తుంది. సెకండాఫ్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బాలయ్య లుక్స్ బాగున్నాయి. బాబీ డియోల్ ఇంట్రడక్షన్ సీన్ బాగుంది. కాకపొతే కథలో పెద్దగా ఊహించని సీన్స్ లేవు. ఆడియన్స్ ఊహకి అందేలా స్క్రీన్ ప్లే ఉండటం కొంచెం మైనస్. పాత కథనే స్టైల్ గా తీసాడు బాబీ. సీతారాం అనే సివిల్ ఇంజినీర్ డాకూ మహారాజ్ గా మారటానికి చూపించిన కారణం బాగానే వర్కౌట్ అయ్యింది. టోటల్ గా బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్టుగా మాస్, కమర్షియల్ అంశాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎమోషనల్ డ్రామాగా డాకు మహారాజ్ ని రూపొందించాడు దర్శకుడు బాబీ.
నటీ నటులు:
బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు. పంచ్ డైలాగ్స్, పవర్ ఫుల్ మాస్ యాక్షన్ తో అదర గొట్టారు. నానాజీ, సీతారాం రెండు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. బాలయ్య లుక్ డిఫరెంట్ గా ఉంది. గెటప్ కి తగ్గా మేనరిజంతో ఫాన్స్ ని అలరించారు బాలయ్య. ఈ ఏజ్ లో కూడా బాలయ్య ఇంత యాక్టీవ్ గా ఉన్నారా? అనిపిస్తుంది యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్యని చూసినప్పుడు. విలన్ గా నటించిన బాబీ డియోల్ కూడా బాలయ్యతో పోటీ పడి నటించాడు. మైనింగ్ కింగ్ గా అద్భుత విలనిజం పండించాడు బాబీ డియోల్. కచ్చితంగా మరిన్ని తెలుగు సినిమాల్లో విలన్ గా బాబీ డియోల్ ని చూసే ఛాన్స్ ఉంటుంది. నందినిగా శ్రద్దా శ్రీనాథ్ పవర్ ఫుల్ పాత్రలో మెరిసింది. కథలో కీలక పాత్ర శ్రద్దాది. తన నటనతో నందిని పాత్రకి న్యాయం చేసింది. స్టోరీని ముందుకు నడిపించే నందిని పాత్రలో నటించి నటిగా మంచి మార్క్స్ కొట్టేసింది. ప్రగ్యా జైస్వాల్ మరో కీలకమైన పాత్రలో నటించింది. తెలుగు సినిమాల్లో కేవలం ఐటెం సాంగ్స్ లో మాత్రమే కనిపించే ఊర్వశి రౌటేలా ఈ మూవీలో ఎస్ఐ గా నటించింది. ఎస్ఐ పాత్రలో నటిస్తూనే అవసరమైన గ్లామర్ కూడా ఒలికించింది. ఈ సినిమా తరవాత ఊర్వశిని ఐటెం గర్ల్ గానే కాకుండా హీరోయిన్ గా చూసే అవకాశం ఉంది. MLA త్రిమూర్తి నాయుడిగా రవికిషన్ నటన బాగుంది. చాలా రోజుల తరవాత రవి కిషన్ తెలుగు సినిమాల్లో విలన్ గా కనిపించారు. రవికిషన్ నటన బాలయ్య కి ధీటుగా ఉంది. చాందినీ చౌదరీ, సచిన్ ఖేడేకర్ మిగతా వారు తమ పాత్రల పరిధి మేరకు నటించి న్యాయం చేశారు.
టెక్నికల్ :
దర్శకుడుగా బాబీ ఫుల్ మార్క్స్ కొట్టేసాడు. కథకుడిగా ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. బాబీ స్టైలిష్ మేకింగ్ ఈ మూవీకి కలిసి వచ్చింది. సినిమా ఎంత స్టైలిష్ గా తెరక్కించాడో, బాలయ్యని కూడా అంతే అందంగా, స్టైల్ గా చూపించాడు. క్లైమాక్స్ పై ఇంకొంచెం ద్రుష్టి పెట్టి, రూపొందించి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో అంత హైపు ఇచ్చి, క్లైమాక్స్ ఈజీగా ముగించేశాడు. కొన్ని సినిమాలు హిట్ బాట పట్టడానికి క్లైమాక్స్ కూడా కారణం అవుతాయి. తమన్ అందించిన మ్యూజిక్ డాకు మహారాజ్ కి పెద్ద ప్లస్. పాటలు నార్మల్ గా ఉన్నా బీజీయం సినిమాకి బాగా ప్లస్ అయింది. కొన్ని సీన్స్ ని తమన్ బీజియం హైలెట్ చేసింది. థియేటర్స్ లో దబిడి దబిడి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ కార్తీక్ కెమెరా వర్క్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఊటి, రాజస్థాన్ లాంటి డిఫరెంట్ ప్లేసెస్ ని మరింత అందంగా చిత్రించాడు. ఇసుకు తుఫాన్ లాంటి సీన్లలో విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పై ఇంకొంచెం శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది. ఫస్టాఫ్ లో కొని సీన్స్ రిపీట్ అయినట్లు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. విజువల్స్ క్వాలిటీ బాగుంది.
ప్లస్ పాయింట్స్
బాలకృష్ణ
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
టెక్నికల్ టీమ్
బాబీ స్టైలిష్ మేకింగ్
మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
సాంగ్స్
క్లైమాక్స్
ఫైనల్ వర్దిక్ట్: బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'డాకు మహారాజ్'