బాలకృష్ణ ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజక వర్గం రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఉంది. సినీ పరిభాషలో రాయలసీమను సీడెడ్ అంటారు. ఈ సీడెడ్‌లో బాలయ్యకి మంచి క్రేజ్ ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన చాలా సినిమాలతో బాలయ్య అక్కడ తనదైన ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్నారు.
'నరసింహానాయుడు', 'సమరసింహా రెడ్డి', తదితర సినిమాలు వసూళ్ల ప్రభంజనం సృష్టించాయక్కడ. ఈసారి సీడెడ్‌లో బాలకృష్ణ ఈ సంక్రాంతికి వసూళ్ళ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నెల 12న విడుదల కాబోతున్న సినిమా 'జై సింహా'పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసినదే. ప్రత్యేకించి, రాజకీయాల పరంగా చూసినా బాలయ్య అభిమానులైన టీడీపీ శ్రేణులు ఇంకొంచెం ఎక్కువ యాక్టివ్‌గా ఉన్న ప్రాంతంగా రాయలసీమ గురించి భావిస్తారు.
సినిమాల పరంగానూ అక్కడ బాలయ్య అభిమానులు దూకుడు మీదుంటారు. ‘జై సింహ’ సినిమాలో పొలిటికల్ డైలాగులూ ఉన్నాయన్న ప్రచారంతో అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. దాంతో బాలయ్య 'జై సింహా' సినిమాపై భారీగా బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయట. 'జై సింహా' సినిమా అక్కడ భారీ వసూళ్లు కొల్టగొట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులూ చెబుతున్నారు. మరో పక్క ఈస్ట్, వెస్ట్, నైజాం ఇలా అన్ని చోట్లా కూడా ’జై సింహ‘ పట్ల హైప్ క్రియేట్ అయ్యింది.
పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న సినిమా 'జై సింహా' సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతోంది. కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాని తెరకెక్కించారు. నయనతార, నటాషా దోషీ, హరిప్రియ హీరోయిన్లుగా నటిస్తున్నారు.