Aditya 999: 'ఆదిత్య 999' గుట్టు విప్పిన బాల‌య్య‌

మరిన్ని వార్తలు

'ఆదిత్య 369'కి సీక్వెల్ గా ఆదిత్య 999 వ‌స్తుంద‌ని చాలా కాలంగా బాల‌య్య అభిమానులు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఇదిగో.. అదిగో అన్నారే కానీ.... ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డలేదు. బాల‌య్య వందో సినిమాగా, మోక్ష‌జ్ఞ మొద‌టి సినిమాగా `ఆదిత్య 999`నే ఫ‌స్ట్ ఛాయిస్‌. అయితే.. బాల‌య్య వందో సినిమా మైలు రాయి.. `గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి` అందుకొంది. అప్ప‌టి నుంచీ.. ఆదిత్య 999 క‌ల‌గానే మిగిలిపోయింది. ఇప్పుడా సినిమాని మ‌ర్చిపోతున్న త‌రుణంలో బాల‌య్య మ‌ళ్లీ ఆశ‌లు రేపాడు. 'ఆదిత్య 999' ప్ర‌స్తావ‌న తెచ్చాడు. అంతేకాదు.. ఈ సినిమాకి తానే ద‌ర్శ‌కుడ‌ని మ‌రో స్వీట్ న్యూస్ వినిపించాడు.

 

విశ్వ‌క్‌సేన్ సినిమా 'ద‌మ్కీ' ట్రైల‌ర్ లాంచ్‌కి బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సినిమాకి విశ్వ‌క్ సేన్ ద‌ర్శ‌కుడు. త‌నే హీరో. రెండు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణం చేసిన విశ్వ‌క్‌ని చూసి బాల‌య్య స్ఫూర్తి పొందాడేమో...? ఆదిత్య 999 సినిమాని గుర్తు చేసుకొన్నాడు. న‌ర్త‌న‌శాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హిద్దామ‌నుకొని, ఆ సినిమాని ప‌క్క‌న పెట్టేయాల్సివ‌చ్చింద‌ని, అప్ప‌టి నుంచీ... ద‌ర్శ‌క‌త్వం వైపు ఆలోచించ‌లేద‌ని, వ‌చ్చే ఏడాది ఆదిత్య 999 తీస్తాన‌ని ఈ సంద‌ర్భంగా అభిమానుల‌కు మాట ఇచ్చేశాడు బాల‌య్య‌. ఆయ‌న అన్నాడంటే చేసి తీర‌తాడు.. సో 2024లో ఆదిత్య 999 చూసేయ‌డం దాదాపుగా ఖాయం అనుకోవాలి.

 

ఈ సినిమా స్క్రిప్టుపై సింగీతం శ్రీ‌నివాస‌రావు ఇది వ‌ర‌కే ప‌ని చేశారు. దాదాపు ఆయ‌న క‌థ సిద్ధం చేసేసిన‌ట్టే. ఆ క‌థే ఇప్పుడు ప‌ట్టాలెక్కిస్తారా, లేదంటే కొత్త క‌థ రాస్తారా? ఇందులో మోక్ష‌జ్ఞ కూడా ఉంటాడా? ఇలా మ‌ళ్లీ కొత్త ప్ర‌శ్న‌లు పుట్టుకొస్తున్నాయి. వాటికి స‌మాధానం బాల‌య్యే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS