తేజ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో స్టార్ట్ కానుంది. బాలయ్య ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మీడియాతో బాలయ్య ఈ సినిమా విషయమై మాట్లాడారు. ఎన్టీఆర్ జీవితంలో ఎవరికీ తెలియని చాలా కోణాలున్నాయి. అవన్నీ ఈ బయోపిక్‌లో చూపిస్తాం అని బాలయ్య అన్నారు.
ఎన్టీఆర్ సినీ, రాజకీయ ప్రస్థానంలో బయటికి తెలియని కోణాలు కొన్ని, చీకటి కోణాలు మరికొన్ని దాగుండగా, అందులో వెన్నుపోటు ఎపిసోడ్ ఒకటి. ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం ఆయన జీవితంలో. ఈ ఘట్టాన్ని ఉన్నది ఉన్నట్లుగా తీస్తే ఆయన జీవితంపై మచ్చ వేసినట్లు అవుతుందని ఎన్టీఆర్‌ని అభిమానించే వారు కొందరు అంటున్నారు.
అయితే ఆ వెన్నుపోటు ఎపిసోడ్‌ని చూపించపోతే తప్పంటున్నారు మరికొంతమంది. వెన్నుపోటు ఎపిసోడ్‌కి సంబంధించి చంద్రబాబు, లక్ష్మీపార్వతి క్యారెక్టర్స్ హైలైట్‌గా చెప్పొచ్చు. లక్ష్మీపార్వతి కారణంగా చంద్రబాబు ఈ వెన్నుపోటు ఎపిసోడ్‌ని క్రియేట్ చేశారనీ అంటుంటారు. కానీ ఎన్టీఆర్‌ని అంతమొందించేందుకే చంద్రబాబు అలా చేశాడనీ పూర్తిగా నేరం చంద్రబాబుపై నెట్టేలా ఆరోపణలు చేస్తూంటారు లక్ష్మీపార్వతి.
అయితే ఇందులో అసలు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఎంత? అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ బయోపిక్‌పై రామ్‌గోపాల్ వర్మ ఓ సినిమా తెరకెక్కించనున్నాడు. ఆయన కూడా దాదాపు ఇదే ఎపిసోడ్‌పై 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కించనున్నాడు. మరో పక్క ఎన్టీఆర్‌తో పరిచయానికి ముందు లక్ష్మీపార్వతి ఏంటి? అనే కాన్సెప్ట్‌పై 'లక్ష్మీస్ వీరగ్రంధం' అనే టైటిల్‌తో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మరో సినిమాని తెరకెక్కిస్తున్నారు. అసలింతకీ వీటిలో ఏది నిజం..? అనేది కాలమే తేల్చాలి?