స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్‌ని బాలయ్య హీరోగా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. రెండు మూడు రోజుల్లో దర్శకుడెవరన్నదీ ప్రకటిస్తామని నందమూరి బాలకృష్ణ చెప్పారు. స్వర్గీయ ఎన్టీయార్ జీవిత చరిత్ర గురించి రాబోయే తరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారాయన. సినీ నటుడిగా, రాజకీయ ప్రముఖుడిగా స్వర్గీయ ఎన్టీఆర్ సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తి అని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. కొన్ని రాజకీయ కారణాలతో సినిమా అటకెక్కినట్లేనని వస్తున్న వార్తల్ని బాలకృష్ణ కొట్టి పారేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రలో తాను నటించడం ఓ అద్భుతమైన ఘట్టమని ఆయన చెప్పారు. ఎన్టీయార్ జీవిత చరిత్రపై చాలా రీసెర్చ్ జరుగుతోందని వివరించారు బాలకృష్ణ. 'పైసా వసూల్' సినిమా అనౌన్స్‌మెంట్ టైంలోనే ఈ బయోపిక్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సినిమా పట్టాలెక్కేందుకు కొంచెం ఎక్కువ టైమే పట్టనుందట. తెలుగు వారు అమితంగా అభిమానించే వ్యక్తి నందమూరి తారక రామారావు. సినీరంగంలో ఆయనది ఓ ప్రస్థానం. రాజకీయాల్లోనూ ఆయన సేవలు అమోఘం. సినీరంగంలో నట సార్వభౌముడిగా ఎదిగి, రాజకీయాల్లో రాణించి, సొంతంగా పార్టీ పెట్టి, రాష్ట్రానికి సీఎంగా ఎదిగిన ఆయన జీవితంలో సాధించిన అభివృద్ధి, ఇతర ప్రధానాంశాలను ఈ సినిమాలో చూపించనున్నారట. మిగిలిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బాలయ్య తెలిపారు.