సినీ పరిశ్రమలో ఎప్పటికప్పుడు సరికొత్త కాంబినేషన్స్ తెరపైకొస్తుంటాయి. కొన్ని కాంబినేషన్స్ అనూహ్యంగా వుంటాయి. రామ్చరణ్ - ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా ఎవరైనా ఊహించారా.? అదే సినిమా మ్యాజిక్ అంటే. మరి, రాజమౌళి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సినిమా వస్తేనో.! ఏమో, ఆ కాంబినేషన్‌ని కూడా మనం చూడబోతున్నామేమో.! అయితే, ఇది ప్రస్తుతానికి అంత ఈజీ వ్యవహారం కాదు. ఎందుకంటే, రాజమౌళి ముందున్న పెద్ద టాస్క్ ప్రస్తుతానికైతే ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాని పూర్తి చేయడమే.
‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి - మహేష్ కాంబినేషన్‌లో సినిమా రావాల్సి వుంది. అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో ఇప్పుడే చెప్పలేం. మరోపక్క ప్రభాస్‌తోనే ఇంకో సినిమా చేయాల్సి వుందని రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. ఎన్టీఆర్‌తోనూ, చరణ్‌తోనూ విడివిడిగా రాజమౌళి చేయాల్సిన సినిమాలూ వున్నాయట. ‘బాలకృష్ణతో ఓ సినిమా గురించి గతంలో అనుకున్నాం.. కానీ, కుదరలేదు.. కొన్ని కథలు వింటున్నప్పుడు కొన్ని కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు వస్తుంటాయి..’ అని ఓ ప్రశ్నకు రాజమౌళి తనదైన స్టయిల్లో సమాధానమిచ్చారు ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో. అన్నట్టు, మెగాస్టార్ చిరంజీవితోనూ రాజమౌళి ఓ సినిమా చేయొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా, జక్కన్న కాంబినేషన్లపై పెద్దగా ఆసక్తి చూపడు. కానీ, కథ కుదిరితే.. ఏ హీరోని అయినా ఆయన ఒప్పించగలడు.