అందాల భామలకి సినిమాలొక్కటే కాదు.. ఇతరత్రా వ్యాపకాలూ ఆర్థికంగా బోల్డంత ఊపునిస్తాయి. నిజానికి కొంతమంది హీరోయిన్లకైతే సినిమాల్లో వచ్చే రెమ్యునరేషన్స్‌తో పోల్చితే ఈవెంట్లు, షోరూమ్స్ ఓపెనింగ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తోందన్నది నిర్వివాదాంశం. అలా హీరోయిన్లు కరోనా వైరస్ దెబ్బకి చాలా ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఓ హీరోయిన్ ఇటీవలే తన ఆర్థిక ఇబ్బందుల్ని సోషల్ మీడియా ద్వారా ఏకరువు పెట్టిన విషయం విదితమే. లాక్‌డౌన్ ఎత్తివేసినా కరోనా వైరస్ ప్రభావం కొన్నాళ్ళు తీవ్రంగానే వుండొచ్చు.. వివిధ రంగాలపై. మరీ ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంపై ఈ ప్రభావం చాలా చాలా ఎక్కువే వుంటుందని అంచనా వేస్తున్నారు.
దియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి.. సినిమా షూటింగుల సంగతి సరే సరి. అలాంటిది, జనం గుమికూడేలా షోరూమ్స్ ఓపెనింగ్స్, ఇతరత్రా ఈవెంట్లకు ఇప్పట్లో ‘గ్రీన్ సిగ్నల్’ పడటం అసాధ్యమే. దాంతో, హీరోయిన్లే కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారని (ఆర్థికంగా) అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికైతే లాక్‌డౌన్ నేపథ్యంలో హీరోయిన్లు రకరకాల వ్యాపకాలతో బిజీగా వున్నారు. వర్కవుట్స్, సింగింగ్, పలు భాషల్ని నేర్చుకోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నారు. సోషల్ మీడియాలో కొందరైతే హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ, తమ ఫాలోయింగ్‌ని పెంచుకుంటున్నారు. కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.? ప్రస్తుతానికైతే అది సస్పెన్సే.