ఎన్టీఆర్ బయోపిక్‌కి సర్వం సిద్ధమైనట్లే. స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత గాధ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తాననీ బాలయ్య అనౌన్స్ చేశారు. ఆ సినిమాలో ఆయనే ఎన్టీఆర్ పాత్రను పోషిస్తారనీ తెలిపారు. అయితే డైరెక్టర్ ఎవరనేది ఇంత వరకూ తెలియలేదు. కానీ తాజాగా ఈ బంపర్ ఛాన్స్ డైరెక్టర్ తేజ చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రాజకీయ నేపథ్యంలో సినిమాని బాగా డీల్ చేసిన డైరెక్టర్ తేజ అయితేనే ఈ సినిమాకి న్యాయం చేయగలడని తలంచి, బాలయ్య ఆ ఛాన్స్ ఆయనకే ఇచ్చేశారు. ఈ విషయాన్ని తేజ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. అంటే తేజ - బాలయ్య కాంబినేషన్ ఎన్టీఆర్ బయోపిక్ పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్నట్లేనని తెలిసిపోయింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నట జీవితం, రాజకీయ ప్రస్థానం దగ్గర నుండీ, ఇతర ముఖ్యమైన అంశాలు ప్రస్థావించనున్నారనీ తెలియవస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో బాలయ్య నిర్మాతగా మారనున్నారనీ టాలీవుడ్ వర్గాల సమాచారమ్. ఎన్టీఆర్ బయోపిక్ కోసం సొంతంగా నిర్మాణ సంస్థని ప్రారంభించే యోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకేం తేజ అనుకున్నది సాధించాడు. ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కించడం నా అదృష్టంగా భావిస్తున్నానంటూ తేజ సంబరపడిపోతున్నారు. కోట్ల మంది జనం అభిమానించే వ్యక్తి ఎన్టీఆర్. అలాంటి వ్యక్తి జీవిత గాధని తెరకెక్కించడం అంటే ఓ సామాజిక బాధ్యతలాంటిది. చాలా జాగ్రత్తగా ఈ ప్రాజెక్ట్‌ని డీల్ చేయాలి. మరి ఇంత పెద్ద బాధ్యతను తేజ ఎలా నెరవేరుస్తారో చూడాలిక.