సినిమాల్లో తొడ కొడితే విజిల్స్ పడతాయి. మీసం మెలేస్తే క్లాప్స్ పడతాయి. రాజకీయాల్లో ఇలాంటివి జుగుప్సాకరంగా అనిపిస్తాయి. నందమూరి బాలకృష్ణ సినీ నటుడు మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధి కూడా. ఆంధ్రప్రదేశ్ నుండి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న బాలకృష్ణ తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హల్‌చల్ చేశారు. కొన్నిచోట్ల మీసం మెలేసి, తొడ కొట్టారు.
వీరావేశంతో కంగాళీ డైలాగులు చెప్పారు. బస్తీ మే సవాల్ అన్నారు. కానీ అన్న కూతురు సుహాసినిని గెలిపించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితాల సరళి చూస్తుంటే బాలయ్య ప్రచారం నవ్వుల పాలైనట్లే. బసవతారకం ఆస్పత్రి విషయంలోనూ, తన సినిమాల విషయంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అవసరాలు తీర్చుకున్న బాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ని సవాల్ చేసి అభాసు పాలయ్యారు.
ఇది రాజకీయ విమర్శ మాత్రమే కాదు. తెలంగాణాలో బాలకృష్ణ అభిమానులు తమ అభిమాన హీరో చేష్టల్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రచారం విషయంలో బాలకృష్ణ కొంచెం సంయమనం పాఠించాల్సింది.. అని బాలయ్య అత్యుత్సాహం టీడీపీ కొంప ముంచేసింది. వ్యక్తిగతంగా బాలయ్య ఇమేజ్‌ని కూడా డ్యామేజ్ చేసింది.