నందమూరి బాలకృష్ణకు దర్శకత్వంపై ఎప్పటి నుంచో గురి ఉంది. తన తండ్రిలా మెగాఫోన్ పట్టాలన్నది ఆశ. `నర్తనశాల` సినిమాని ప్రారంభించింది అందుకే. అయితే... ఆ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది. సౌందర్య మరణంతో ఆ సినిమాకి బ్రేకులు పడ్డాయి. బాలయ్య కల అలా... కలలానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు ఆ కలకు మళ్లీ చిగుళ్లు తొడుగుతున్నాయి. త్వరలోనే బాలకృష్ణ దర్శకత్వం కూడా వహించే అవకాశం ఉందన్నది టాలీవుడ్ టాక్. అది కూడా మోక్షజ్ఞ సినిమాతో.
అవును... మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆదిత్య 369కి సీక్వెల్ చేస్తారని, అందులో బాలయ్యతో పాటు మోక్షజ్ఞ కూడా కనిపించనున్నారని టాక్. దానికి బాలయ్య కామెంట్లు మరింత ఊతం ఇస్తున్నాయి. ఆదిత్య 369కి సీక్వెల్ చేస్తానని, అందులో నేనూ, మోక్షజ్ఞ కలిసి నటిస్తామని.. బాలయ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అభిమానుల్లో సంతోషాన్ని నింపుతోంది.
ఈ సినిమాకి కథ కూడా బాలకృష్ణే అందించార్ట. కథ, స్క్రీన్ ప్లే బాలయ్యే ఇస్తే... దర్శకత్వం కూడా ఆయన చేసే అవకాశం ఉంది. ఈ సినిమాతో ఆ కోరిక కూడా బాలయ్య నేరవేర్చుకోవచ్చన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.