ఆహా కోసం బాలకృష్ణ ఓ టాక్ షో చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి `అన్ స్టాపబుల్` అనే పేరు పెట్టారు. త్వరలోనే ఈ టాక్ షో.. స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే సెలబ్రెటీలతో బాలకృష్ణ ఇంటర్వ్యూలు మొదలెట్టేశారని, ఓ మంచి ముహూర్తం చూసుకుని, ఈ షోని ప్రారంభిస్తారని సమాచారం. బాలయ్య టాక్ షోకి వచ్చాడంటే ఇక రికార్డులకు దబిడ దిబిడే. ఆహాలో ఎన్ని టాక్ షోలు వచ్చినా, పెద్దగా పాపులర్ అయ్యింది లేదు.
ఈసారి మాత్రం - కచ్చితంగా ఈ షో సక్సెస్ అవుతుందనే భావిస్తున్నారు. మరి... బాలయ్య షో అంటే.. స్పెషల్ గా ఉండాలి కదా? అందుకే ఈ షో కోసం చిరంజీవిని కూడా బరిలోకి దించుతున్నట్టు సమాచారం. బాలయ్య టాక్ షో.. తొలి ఎపిసోడ్ చిరంజీవితోనే అని ఇన్ సైడ్ వర్గాల టాక్. చిరు - బాలయ్యలు ఒక షోలో కనిపించడం, బాలయ్య అడిగే ప్రశ్నలకు చిరు సమాధానాలు ఇవ్వడం - ఇంతకంటే కిక్ ఏముంటుంది? ఫస్ట్ ఎపిసోడ్ నుంచే, వీక్షకులను తమ వైపుకు తిప్పుకోవొచ్చు. అంతేకాదు... ఫస్ట్ ఎపిసోడ్ లో చిరుతో పాటు చరణ్ కూడా కనిపించబోతున్నాడని సమాచారం. అయితే.. ఇందుకు సంబంధించిన వివరాలు బయటకు రావాల్సివుంది.