సున్నితమైన విషయాలు డీల్ చేసేటప్పుడు క్రియేటర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం మనోభావాలు దెబ్బతిన్నా - సమస్యలొచ్చేస్తాయి. విమర్శకులు దాడి చేయడానికి రెడీగా ఉంటారు. వర్గాల మధ్య పోరు మొదలైపోతుంది. చివరికి లేనిపోని తలనొప్పులు వస్తాయి. `ది ఫ్యామిలీమెన్ 2` వెబ్ సిరీస్‌కీ ఇలాంటి సమస్యలే వ్యాపించాయి.
రాజ్ డీకే రూపొందించిన వెబ్ సిరీస్ `ది ఫ్యామిలీ మెన్`. తొలి సీజన్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు రెండో సీజన్ స్ట్రీమింగ్ కి రెడీగా ఉంది. సమంత లాంటి స్టార్ కథానాయిక ఈ సీజన్‌లో కనిపించనుండడంతో మరింత మైలేజీ వచ్చింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరికీ నచ్చినా, ఆ ట్రైలర్ తో కొంతమంది మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా తమిళ వాసులు నిప్పులు చెరుగుతున్నారు.
శ్రీలంకలో పోరాటం చేసిన తమిళుల మనోభావాలను ఈ సిరీస్ దెబ్బతీసేలా ఉందని, వాళ్ల పోరాటాన్ని చులకన చేస్తోందని, తమిళుల చరిత్రని వక్రీకరిస్తోందన్న వాదనలు మొదలయ్యాయి. దాంతో ఈ ట్రైలర్ వచ్చినప్పటి నుంచీ రకరకాలలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సమంతని ట్రోల్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగి.. ఈ వెబ్ సిరీస్ ని బ్యాన్ చేసేలా చర్యలు మొదలెట్టిందని సమాచారం. ఈ విషయమై తమిళ ప్రభుత్వం కేంద్ర ప్రచార సమాచార శాఖతో సంప్రదింపులు మొదలెట్టిందని, ఈ సిరీస్ ని బ్యాన్ చేసేలా చర్యలు తీసుకోబోతోందని తెలుస్తోంది. మొత్తానికి ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. వాటిని ఎలా దాటుకొస్తుందో చూడాలి.