సినీ సెలబ్రెటీలు రాజకీయాల్లోకి రావడం చాలా సాధారణమైన విషయం అయిపోయింది. అయితే.. ఎంత స్టార్లయినా, సినిమాలు వేరు- రాజకీయాలు వేరు అనే విషయం అర్థమవుతూనే ఉంది. రాజకీయాలు అంత ఈజీ కాదని, ఇక్కడ నెగ్గడం కష్టమన్న సంగతి తెలుస్తూనే ఉంది. ఇటీవల తమిళనాట రాజకీయాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. అక్కడ స్టార్ హీరోలు బోల్తా పడ్డారు. మక్కల్ నీది మయ్యం అనే పార్టీ స్థాపించి, తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన కమల్ హాసన్.. ఘోరంగా ఓడిపోయారు.
తన పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. స్వయంగా తానే ఓడిపోవడం అభిమానులకు సైతం షాక్ ఇచ్చింది. దాంతో... పార్టీలోకి కీలకమైన నేతలు ఒకొక్కరుగా జారుకోవడం మొదలెట్టారు. వెళ్తూ వెళ్తూ పార్టీపై, కమల్ వ్యవహార శైలిపై విమర్శలు గుప్పించారు. దాంతో కమల్ పార్టీ ఖాళీ అయిపోయిందని, ఆయన రాజకీయ అస్త్ర సన్యాసం చేయబోతున్నారన్న కామెంట్లు వినిపించాయి.
దీనిపై కమల్ క్లారిటీ ఇచ్చారు. తన పార్టీ బోర్డు తిప్పేయడం లేదని, తన ప్రాణం ఉన్నంత వరకూ రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. పార్టీలో ఉన్నవాళ్లు ఉంటారని, ఇష్టం లేనివాళ్లు వెళ్లిపోతారని, ఎవరు వెళ్లిపోయినా, పార్టీ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. పార్టీని వదిలి వెళ్లిపోతున్నవాళ్లపైనా ఘాటుగా కౌంటర్లు విసిరారు. వాళ్లు వ్యాపార వేత్తల్లా మారిపోయారని, ఓచోట నష్టం వస్తే.. మరో చోట వ్యాపారం మొదలెట్టే వాళ్లు తనకు అవసరం లేదని ఎద్దేవా చేశారు. సో... కమల్ పార్టీ ఇంకొంత కాలం నడుస్తుందన్నమాట.