నటీనటులు : జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో, దేవరాజ్, అచ్యుత్ కుమార్ తదితరులు
రచన, దర్శకత్వం : జయతీర్థ
మాటలు : రఘు నిడువల్లి
ఛాయాగ్రహణం : అద్వైత గురుమూర్తి
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
ఎడిటర్: కె ఎం ప్రకాష్
నిర్మాత: తిలక్ రాజ్ బల్లాల్
తెలుగులో విడుదల : 'నాంది' ఫేమ్ సతీష్ వర్మ!
రేటింగ్: 2.25/5
కన్నడ పరిశ్రమ పాన్ ఇండియా సత్తా చాటుతోంది. కేజీయఫ్, 777 చార్లీ , కాంతార, విక్రాంత రోణ చిత్రాలు ఒక్కసారిగా ఇండియన్ సినిమా దృష్టిని ఆకర్షించాయి. ఇప్పుడు కన్నడ నుండి మరో పాన్ ఇండియా మూవీగా వచ్చింది బనారస్. కన్నడ లో పొలిటికల్ గ్లామర్ వున్న జైద్ ఖాన్ ఈ సినిమా తో నటుడిగా పరిచయం అయ్యాడు.
ఐతే 'బెల్ బాటమ్' తో ఆకట్టుకున్న జై తీర్ధ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, ట్రైలర్ ఆకట్టుకోవడం సినిమా ఆసక్తి ఏర్పడింది. ఇదే సమయంలో ట్రైలర్ లో చూపించిన టైం ట్రావెల్ పాయింట్ 'మానాడు' సినిమాతో పోలిక వచ్చింది. మరి ఆ పోలికలో వాస్తవం ఉందా ? బెల్ బాటమ్ తో ఆకట్టుకున్న జయతీర్ధ బనారస్ తో ఎలాంటి వినోదాన్ని ఇచ్చాడు ?
కథ:
సిద్ (జైద్ ఖాన్) ఆర్ధికంగా స్థితిమంతుడు. చాలా హ్యాపీ లైఫ్ గడుపుతుంటాడు. ధని (సోనాల్ మోంటెరియో) చిన్నప్పుడే తల్లితండ్రులని పోగొట్టుకుంటుంది. చదువు కోసం చుట్టాలంటికి వస్తుంది. ధని చాలా పద్దతైన అమ్మాయి. మంచి గాయిని కూడా. దమ్ముంటే ధనిని ప్రేమలో దించమని సిద్ తో బెట్ కడతారు అతడి స్నేహితులు. బెట్ ని సవాల్ గా తీసుకున్న సిద్.. ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. తనో టైం ట్రావలర్ నని, భవిష్యత్ నుండి వచ్చానని, భవిష్యత్ తో నువ్వే నా భార్యవని ధనితో చాలా నమ్మశక్యంగా చెబుతాడు. సిద్ మాటలని ధని నమ్ముతుంది. అతడ్ని తన గదికి తీసుకెళుతుంది.
ధని నిద్రపొతున్నపుడు తనతో ఫోటో తీసుకొని స్నేహితులకి షేర్ చేస్తాడు సిద్. సిద్ ట్యాలెంట్ చూసి స్నేహితులు షాక్ అవుతారు. బెట్ లో గెలవడంతో ఫ్రెండ్స్ అంతా ఫారిన్ టూర్ కి వెళ్తారు. అయితే తిరిగి వచ్చేసరికి ధని కాలేజీలో వుండదు. సిద్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాకి లీకై వైరల్ అవుతుంది. దీంతో అవమానం తట్టుకోలేక ధని తన సొంత ఊరు బనారస్ వెళ్ళిపోతుంది. చేసిన తప్పుకు కుమిలిపోతాడు సిద్. సిద్ ని అపరాధ భావం వెంటాడుతుంది. ధనిని కలసి క్షమాపణ అడగడానికి బనారస్ పయనమౌతాడు. మరి ధనిని కలిశాడా ? ధని, సిద్ ని క్షమించిందా ? సిద్ కి బనారస్ లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? కాలం అతడికి ఎలాంటి పరీక్ష పెట్టింది ? అనేది మిగతా కథ ?
విశ్లేషణ:
టైం ట్రావెల్ కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ మధ్య వచ్చిన ఒకే ఒక జీవితం కూడా టైం ట్రావెల్ కథే. అయితే, కాలం అనే కాన్సెప్ట్‌ను ఎవరు? ఎలా ఉపయోగించుకుని ఆసక్తికరంగా మలిచారన్నదానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పాయింట్ ని ప్రజంట్ చేయడం దర్శకుడు జయతీర్ధ విఫలమయ్యాడు. అంతేకాదు ‘మానాడు’ టైమ్ లూప్ కాన్సెప్ట్ నే మళ్ళీ చూపించడం నిరాశకు గురి చేసింది. ఈ కథలో టైం ట్రావెల్ వుందని ట్రైలర్ లోనే తెలిసింది. అయితే ఆ పాయింట్ మానాడుకి మరీ మక్కీలా వుంది.
హీరో మొదటి సీన్ లోనే హీరోయిన్ ని పరిచయం చేసుకుంటూ తను భవిష్యత్ నుండి వచ్చానని చెబుతాడు. ''ఫస్ట్ సీన్ లోనే కథలోకి వేల్లిపోయారా ?' అనే సంబరపడేలోపలే.. అది హీరో వాడిన అతి పురాతన కాలం నాటి ట్రిక్కు అని తెలిసేసరికి సినిమా ఒక్కసారిగా కిందకుపడిపోతుంది. అలా పడిన సినిమా ఇంక ఎంతకీ లేవదు. బీసి కాలం నాటి ఓ ప్రేమ కథ నడుస్తుంటుంది. అయితే ఇందులో కొత్తదనం ఏమిటంటే.. అ కథ బనారస్ లో నడవడం. అది తప్పితే ఆ ప్రేమ కథలో ఇంకేమీ చెప్పడానికి వుండదు.
ప్రపంచానికి ఎదో చెప్పాలని ప్రయత్నిస్తుంటాడు దర్శకుడు. కానీ ఆ చెప్పదలచుకున్న సంగతిపై అసలు దర్శకుడికే ఒక క్లారిటీ వుండదు. టైం లూప్ లో డబుల్ యాక్షన్ అనే భ్రమ కల్పించి విరామం ఇవ్వడం మరీ సిల్లిగా వుంటుంది. ఇక సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే బెనరాస్ కాస్త మానాడు సినిమగా మారిపోతుంది. మనాడు చూసిన వారు బెనారస్ చూస్తే మాత్రం అయిపోయిన మ్యాచ్ ని రిపీట్ లో చూస్తునట్లుగా వుంటుంది. అయితే ఎక్కడ కాపీ అంటారేమోనని ఇందులో కెమిస్ట్రీ యాంగిల్ ని చేర్చాడు దర్శకుడు. ఏవేవో ఈక్వేషన్ లు, ఫార్మూలాలు దంచికొడతాడు. పిరియడ్ ఎప్పుడైపోతుందో అని ఎదురుచూసిన స్టూడెంట్ లా ప్రేక్షకుడు ఎగ్జిట్ డోర్ వైపు ఆశగా చూడటం తప్పితే ఆ కెమిస్ట్రీని తట్టుకొనే ఆసక్తి, శక్తి రెండూ వుండవు.
నటీనటులు:
జైద్ ఖాన్ కి తొలి సినిమా ఇది. అయితే అతనితో మంచి ఈజ్, ఎనర్జీ వుంది. చాలా హుషారుగా చేశాడు. ధని పాత్రలో చేసిన సోనాల్ మోంటెరియో ఆకట్టుకుంది. నిండుగా అందంగా వుంది. నటన కూడా ఓకే. కన్ను తెరచిన పాటలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. అలాగే తొలి తొలి వలపే పాటలో గ్లామర్ తో ఆకట్టుకుంది. దేవరాజ్, అచ్యుత్, సుజయ్ శాస్త్రీ మిగతా పాత్రలు పరిధిమేర వున్నాయి. శంబు పాత్రలో సుజయ్ కి మంచి రోల్ దక్కింది.
సాంకేతిక వర్గం:
నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. బనారస్ ని చాలా సహజంగా అందంగా చూపించారు. అజనీష్ లోక్‌నాథ్ కన్నుతెరిచిన పాట, తొలితొలి వలపే, మాయగంగా పాటలు బావున్నాయి. నేపధ్య సంగీతం కూడా కష్టపడి చేశాడు. ఎలివేషన్ లేని చోట కూడా ఎదో ఫిల్ చేయడానికి చాలా తాపత్రయపడ్డాడు. అద్వైత్ గురుమూర్తి కెమరా వర్క్ నీట్ గా వుంది. కథకు తగ్గట్టు నిర్మాణ విలువలు వున్నాయి,
ప్లస్ పాయింట్స్
జైద్ ఖాన్, సోనాల్
బనారస్ నేపధ్యం
సంగీతం
మైనస్ పాయిన్స్
తెలిసిన కథ
ప్రేమ కథలో ఎమోషన్ లేకపోవడం
సెకండ్ హాఫ్ 'మానాడు'కావడం
ఫైనల్ వర్డిక్ట్ : 'మానాడు' కి మరో వెర్షన్!