ఈసారి మా ఎన్నికలు రసాభసగా సాగాయి. ఎన్ని ట్విస్టులో.. ఎన్ని వివాదాలో. అన్నింటిమధ్యా నేనూ ఉన్నా అని ముందుకొచ్చాడు బండ్ల గణేష్. ముందు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉండి, ఆ తరవాత జీవిత ని వ్యతిరేకించి, బయటకొచ్చి, ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి, ఆ తరవాత నామినేషన్ ని ఉపసంహరించుకుని ఇలా.. చాలా ట్విస్టులిచ్చాడు బండ్ల గణేష్. చివరికి.. `జీవితకు ఓటేయొద్దు... జనరల్ సెక్రటరీగా రఘుబాబుని గెలిపించండి` అంటూ ట్వీట్ చేశాడు.
చివరికి జీవిత 7 ఓట్ల స్వల్ప తేడాతో రఘుబాబుపై ఓడిపోయింది. ఈ ఓటమికి కారణం... బండ్ల గణేష్ అనడం కాదనలేని సత్యం. బండ్ల గణేష్ గనుక... జీవితకు మద్దతు ఇచ్చి ఉంటే, రఘుబాబుపై జీవిత విజయం సాధించేదే. రాజశేఖర్, జీవితలపై బండ్లకు కోపం ఎక్కువ. `మా` ఎన్నికల ప్రచారంలో వాళ్లని ఎక్కువగా టార్గెట్ చేశాడు బండ్ల.
అప్పట్లో మెగా కుటుంబాన్ని జీవిత విమర్శించారని, అందుకే తాను వాళ్లకు మద్దతు ఇవ్వడం లేదని నేరుగా చెప్పేశాడు. చివరికి... జీవిత ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. ఈ ఎన్నికలలో ఇదో మర్చిపోలేని చాప్టర్.