స్టార్ హీరోల వారసులు... హీరోలై, టాలీవుడ్ ని ఏలే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్లే రాణిస్తారు. బ్యాగ్రౌండ్ కేవలం ఓ చిన్న ఆసరా మాత్రమే. ఈ విషయాన్ని రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్‌సేన్‌లాంటి వాళ్లు నిరూపించారు కూడా. అయితే అక్కడక్కడ... నెపోటిజం లాంటి పదాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తాజాగా విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు కూడా అలాంటివే. లైగర్ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌లో... తన ఫ్యాన్స్‌ని చూసి రెచ్చిపోయాడు విజయ్ దేవరకొండ. ``నా అయ్యా మీకు తెలీదు... నా తాతా తెలీదు... అయినా ఇంత రచ్చేంట్రా..`` అంటూ పరోక్షంగా వారసత్వ హీరోలపై సెటైర్లు వేశాడు.
దీనిపై ఇప్పుడు బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చాడు. ``తాతలు తండ్రులూ ఉంటే సరిపోదు. టాలెంట్ కూడా ఉండాలి. ఒక ఎన్టీఆర్‌లా, ఒక మహేష్ బాబులా, ఒక రామ్ చరణ్‌లా, ఒక ప్రభాస్‌లా.. గుర్తు పెట్టుకో బ్రదర్..`` అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. ఈ కామెంట్ లో విజయ్ దేవరకొండని ప్రస్తావించలేదు. కానీ.. ఇది కచ్చితంగా విజయ్ కి కౌంటరే. ఇప్పుడు స్టార్ హీరోలుగా వెలుగుతున్న వాళ్లెవ్వరూ కేవలం వారసత్వంతోనే ఎదగలేదు. వాళ్లకంటూ సెపరేట్ స్టైల్ ఉంది. వాళ్లకంటూ ప్రతిభ ఉంది. అదే... వాళ్లని స్టార్లు చేసింది.
ప్రతీ హీరోకి తన సొంత అభిమానగణమంటూ ఉంది. ఈ విషయాన్ని విజయ్ కూడా గుర్తు పెట్టుకొంటే మంచిది.