పొగడ్తలు చెట్టుకున్న పువ్వులాంటివి. అందంగా వుంటాయి. కానీ చెట్టు మొత్తం పువ్వులే అయితే .. చాలా ఎబ్బెట్టుగా వుంటుంది. వకీల్ సాబ్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇదే. పవన్ కళ్యాణ్ ఈవెంట్ అన్నప్పుడు నిర్మాత బండ్ల గణేష్ కామన్. ఆయన మైక్ పట్టుకోవడమూ వెరీ కామన్. పొగడ్తలు ఇంకా కామన్. అయితే నిన్నటి పొగడ్తల్లో మాత్రం డోసు పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ కి రికార్డులు కొత్తకాదన్నారు బండ్ల. ఇక్కడి వరకూ బావుంది. కానీ తర్వాత ఆయన ఏదేదో మాట్లడేశారు. పవన్ కళ్యాణ్ కు వ్యాపారాలు లేవు.. ఆయనది రక్తం వ్యాపారమన్నారు. అదెలా అంటే .. ఆయన రక్తం నీరు చేసి చెమట చెందించి నటించి అభిమానులని అలరిస్తారట. ఇక్కడి వరకూ ఓకే.
కానీ తర్వాతే బండ్ల విష్ణు శహస్రనామంలా పవన్ సహస్రనామం అందుకున్నారు. రాముడు, ఆంజనేయుడు, ఈశ్వరుడు.. ఇలా దేవుళ్ళు అందరితో పవన్ పోలుస్తూ ఉపమాన అలంకారం సైతం సిగ్గుపడిపోయేలా కీర్తించేశారు. అసలే పవన్ కళ్యాణ్ సిగ్గరి. బండ్ల మాట్లాడుతున్నంత సేపు సిగ్గుతో నవ్వుతూనే వున్నారు పవన్. ఐతే పవన్ కళ్యాణ్ నవ్వులని ఫోటోలో బంధించడానికి వీలు లేకుండపోయింది. కరోనా నిబంధనలు కారణంగా ఆయన మాస్క్ పెట్టుకున్నారు. బండ్ల పొగడ్తల నుండి తప్పించుకోవడానికి ఒక విధంగా మాస్క్ పవన్ కళ్యాణ్ కు హెల్ప్ అయ్యిందనే చెప్పాలి.