ఏ దర్శకుడికైనా... అత్యుత్తమ అవుట్ పుట్ ఇవ్వాలని ఉంటుంది. పైగా తను ఫ్లాపుల్లో ఉంటే.. ఇంకాస్త్ర కసితో, శ్రద్ధతో సినిమాని తెరకెక్కించాల్సిన అవసరం ఉంటుంది. వినాయక్ పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు రాజమౌళి, సుకుమార్‌లతో పోటీగా సినిమాలు తీసి, హిట్లు కొట్టిన దర్శకుడు ఆయన. ఇప్పుడు ఫామ్ లో లేడు. సినిమా తీసి చాలా కాలమైంది. బెల్లం కొండ సాయి శ్రీనివాస్ తో `ఛత్రపతి` సినిమాని రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. అయితే ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ సినిమా అవుట్ పుట్ పై నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. వినాయక్ కు కూడా.. ఈ సినిమాపై నమ్మకం సన్నగిల్లుతోందని తెలుస్తోంది. అందుకే... రీషూట్లు మొదలెట్టార్ట. ఇప్పటికే ఈ సినిమాలోని చాలా సీన్లు రీషూట్లు చేశారని, అయినా సంతృప్తి లేదని, తీసిన సీనే మళ్లీ మళ్లీ తీస్తున్నారని, దాంతో బెల్లకొండ సాయి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నాడని సమాచారం. ఛత్రపతి సినిమా కోసమే మరో సినిమా ఏదీ ఒప్పుకోలేదు.
ఈ సినిమా బయటకు వచ్చాక.. రిజల్ట్ ని బట్టి కొత్త సినిమాల్ని ఎంచుకోవాలని బెల్లం కొండ భావిస్తున్నాడట. అయితే ఎంతకీ ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం, రీషూట్ల మీద రీషూట్లు చేస్తుండడంతో... బెల్లంకొండ విసిగిపోయాడని టాక్. అందుకే కొంతకాలం ఈ సినిమా షూటింగ్ కి డుమ్మా కొట్టి, వేరే కథలు విని, ప్రాజెక్టులు సెట్ చేసుకోవాలని భావిస్తున్నాడట. నిర్మాతలు సైతం ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెడితే బాగుంటుందని సలహా ఇచ్చినట్టు టాక్.